ముఖ్యమంత్రిగా మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఇది: టీడీపీ అధినేత చంద్రబాబు

TDP Chief Chandrababu Recollects His Tenure of Chief MInister and Services, Chandrababu Recollects His Tenure As CM, Chandrababu Naidu First CM Of AP, AP First CM Chandra Babu Naidu, Mango News, Mango News Telugu, N Chandrababu Naidu First AP CM , N Chandrababu Naidu First CM Tenure, N Chandrababu Naidu , Chandra Babu Naidu Latest News And Updates, TDP Chief N Chandra Babu Naidu, Telugu Desham Party

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసిన రోజు సెప్టెంబర్ 1, 1995. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా తన ప్రస్థానం, చేపట్టిన అభివృద్ధి పనులు, తీసుకొచ్చిన సంక్షేమ పథకాల గురించి గురువారం చంద్రబాబు వరుస ట్వీట్స్ చేశారు. “ముఖ్యమంత్రిగా నేను మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఇది. సెప్టెంబర్ 1, 1995వ తేదీన అంటే నేటికి సరిగ్గా 27 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాను. నాటి నుంచి సుమారు పదునాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసాను. ముఖ్యమంత్రిగా పద్నాలుగేళ్ల ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్ళు. మరెన్నో కీలక మలుపులు. ఈ ప్రయాణాన్ని ఒకసారి గుర్తుచేసుకుంటే, మొదటిసారిగా నేను ముఖ్యమంత్రి అయినప్పుడు ముందుగా నేను ఆలోచించింది ప్రజలకు జవాబుదారీ పాలన అందించడం గురించి. పాలకులు అంటే ప్రజలకు సేవకులు అన్న ఎన్టీఆర్ నినాదాన్ని అమలులోకి తెచ్చేందుకే ప్రజల వద్దకు పాలనతో ప్రభుత్వ అధికార గణాన్ని ప్రజలకు చేరువ చేయడం జరిగింది. అది ప్రజల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంచింది.అంతేకాదు జన్మభూమి వంటి కార్యక్రమాలతో ప్రజలను కూడా పాలనలో భాగస్వాములు చేయడం జరిగింది” అని అన్నారు.

“ఒక పనిని సాధించాలంటే ఒక విజన్ తో కూడిన స్పష్టమైన ప్రణాళిక అవసరం. అలాగే ఒక రాష్ట్రానికి కూడా దీర్ఘకాల ప్రణాళిక ఉండాలి. అదే నేను రూపొందించిన ‘విజన్-2020’ అనే విజన్ డాక్యుమెంట్. అప్పట్లో ఎగతాళి చేసినవారే, ఆ తర్వాత ఆ విజన్ డాక్యుమెంట్ ఫలితాలను ప్రత్యక్షంగా చూస్తున్నారు. మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలను ఆంధ్రప్రదేశ్ కు తీసుకువచ్చి, ప్రపంచ ఐటీ రంగం దృష్టి రాష్ట్రంపై పడేలా చేయడంతో లక్షలాది ఐటీ ఉద్యోగాలు వచ్చాయి. ఐటీ ఉద్యోగాలకు నిపుణులను సిద్ధం చేసేందుకు పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కాలేజీలను అందుబాటులోకి తేవడం జరిగింది. అలాగే విద్యారంగంలో సమూల మార్పులు చేసి విద్యను గ్రామీణ ప్రాంతాలకు చేరువ చేసాం. ఆరోజు పడిన కష్టానికి ఫలితంగా ఈరోజు ఒక రైతు బిడ్డ నుంచి ఒక కార్మికుని కొడుకు వరకు దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ, కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. ఈరోజు అమెరికాలో ఎక్కువ ఆదాయం పొందుతోన్న భారతీయుల్లో 30 శాతం మంది తెలుగువారే అన్నమాట విన్నప్పుడు నాకెంతో తృప్తిగా అనిపిస్తుంది. ఆనాడు ఒక పదేళ్ల పాటు దేశంలో ఎవరి నోట విన్నా ఆంధ్రప్రదేశ్ మాటే వినిపించేది. రాష్ట్రానికి తెచ్చిన పెట్టుబడులు, సంస్థలు దేశం దృష్టిని ఆకర్షించాయి. పెరుగుతున్న మన అవసరాలు తీరాలంటే సంపద సృష్టి జరగాలన్నది ఆనాడు నేను చేసిన మరో ఆలోచన. ఏపీకి వచ్చే సంస్థల కోసం మౌలిక రంగ అభివృద్ధి చేసాం. బెస్ట్ పాలసీలను తీసుకు వచ్చాం. అందుకు ఉదాహరణ సైబరాబాద్ నగర నిర్మాణం. ఇప్పుడు సైబరాబాద్ దేశ విదేశాల్లోని అనేక సంస్థలకు కీలక వేదికగా నిలిచింది” అని చంద్రబాబు అన్నారు.

అలాగే కొన్ని రంగాల్లో సంస్కరణలు చాలా అవసరం అనిపించింది. అదే సమయంలో నా ఆలోచనలకు ప్రాధాన్యత ఇచ్చే వాజ్ పేయి ప్రధానిగా ఉండటం కలిసొచ్చింది. జాతీయ స్థాయిలో ఓపెన్ స్కై పాలసీ, టెలికాం పాలసీ, స్వర్ణ చతుర్భుజి రోడ్డు, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ లు, సూక్ష్మ సేద్యం వంటివి దేశానికి పరిచయం చేయడంలో కీలక పాత్ర వహించే అవకాశం రావడం నా అదృష్టం. అబ్దుల్ కలాం వంటి వారిని రాష్ట్రపతిగా ఎంపిక చేసుకోవడంలో నా పాత్ర ఉండటం మధుర జ్ఞాపకం. అలాగే రంగరాజన్ వంటి వారిని గవర్నర్ గా ఏపీకి తెచ్చుకున్నాం. తెలుగుదేశం నేతల్లో బాలయోగిని దేశానికి తొలి దళిత స్పీకర్ గా, ఎర్రంనాయుడుని కేంద్రమంత్రిగా చేసుకుని తెలుగుదేశం ఆత్మగా ఉండే సామాజిక న్యాయాన్ని మరింత విస్తృత పరచగలిగాం. రాష్ట్ర విభజన తర్వాత 2014 లోనూ ఏపీకి ముఖ్యమంత్రిగా ప్రజలు బాధ్యత ఇస్తే లోటు బడ్జెట్ రాష్ట్రంలో రెండంకెల వృద్ధి రేటు సాధించి చూపించాము. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధాని నగరంగా నిర్మించే కృషిచేసాం. కృష్ణా-గోదావరి నదుల అనుసంధానం ద్వారా నదుల అనుసంధానం అనే కీలక ప్రక్రియను మొదలు పెట్టాం. అన్న క్యాంటీన్, తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్, విదేశీ విద్య, చంద్రన్న బీమా వంటి వినూత్న సంక్షేమ పథకాలతో పేదలకు అండగా నిలిచాం. ముఖ్యమంత్రిగా నేను ఏం చేసినా భావితరాల ఉజ్వల భవిష్యత్తే నా లక్ష్యం అయ్యింది. దాదాపు 14 సంవత్సరాల పాలనా కాలంలో ముఖ్యమంత్రిగా నేను సాధించిన విజయాలు నావి కావు, తెలుగు ప్రజలవి. నేను కేవలం ప్రజలు నాకు ఇచ్చిన అవకాశాన్ని, అధికారాన్ని వారికి మంచి చేసేందుకు సద్వినియోగం చేసుకున్నానంతే” అని చంద్రబాబు పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 11 =