తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మొన్నటి వరకు ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించిన పార్టీలు.. ఇప్పుడు అనూహ్యంగా వెనకడుగు వేస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందు టీడీపీ సిద్ధమయింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల ఎన్నికల నుంచి తప్పుకుంది. అటు వైఎస్సార్‌టీపీ కూడా ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించి.. చివరికి తప్పుకుంది. అయితే జనసేన కూడా ఎన్నికల బరిలో నుంచి తప్పుకునే యోచనలో ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీజేపీ వైఖరే ఇందుకు కారణమని ప్రచారం జరుగుతోంది.
ముందు ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతామని జనసేనాని పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఇందుకు సంబంధించి 32 నియోజకవర్గాల పేర్లను కూడా వెల్లడించారు. ఆ తర్వాత బీజేపీ జనసేనానితో సంప్రదింపులు జరిపింది. ఎన్నికల్లో పోటీ చేయకుండా తమకు మద్ధతు ఇవ్వాలని కోరింది. ఈ మేరకు బీజేపీ, జనసేనాని మధ్య పొత్తు కుదిరింది. అయితే జనసేనాని కనీసం 20 స్థానాలు అయినా ఇవ్వాలని కోరారు. అటు బీజేపీ 6 నుంచి 8 సీట్లు మాత్రమే ఇస్తామని పట్టుపట్టుకొని కూర్చుంది.
అయితే ఆ స్థానల లెక్క కూడా ఇప్పటి వరకు తేలలేదు. మొన్నటి వరకు జనసేనకు 11 సీట్లు ఇచ్చేందుకు బీజేపీ సిద్ధమయిందని ప్రచారం జరిగింది. కానీ అవన్నీ ఊహాగానాలేనని మళ్లీ ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు కూడా బీజేపీ.. జనసేనకు ఇచ్చే సీట్లు, నియోజకవర్గాలను ఫైనల్ చేయలేదట. అటు చర్చలు జరిపి ఇదో ఒకటి తేల్చుకుందామంటే.. అందుకు కూడా ఇప్పుడు బీజేపీ ముందుకు రావడం లేదట. ఇదే సమయంలో వరుణ్ తేజ్ వివాహం కోసం పవన్ కల్యాణ్.. ఇటలీకి వెళ్లారు.
దీంతో రెండు పార్టీల మధ్య పొత్తు వ్యవహారం.. సీట్ల పంపకం.. నియోజకవర్గాలు ఫైనల్ చేయడం ఇంకా పెండింగ్‌లోనే ఉండిపోయింది. అటు ఎన్నికలకు నెలరోజుల సమయం కూడా లేదు. ఈక్రమంలో జనసేనను గుప్పిట్లో పెట్టుకొని చివరికి దెబ్బ కొట్టడమే బీజేపీ అసలు ఉద్దేశ్యమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈక్రమంలో అసలు పోటీ నుంచే తప్పుకుంటే ఎలాగుంటుందనే చర్చ జనసేనలో మొదలయిందట. పవన్ కల్యాణ్ ఇటలీ నుంచి తిరిగొచ్చాక దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE