ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక.. వేల కోట్ల రూపాయలు ప్రజా సంక్షేమం కోసం ఖర్చు చేశారు. అయినప్పటికీ ప్రజామెప్పు కోసం సిద్ధం పేరుతో జగన్ రాష్ట్రమంతటా సభలు నిర్వహిస్తున్నారు. ఐదేళ్లలో ప్రజల కోసం ఏం చేశారో వివరిస్తున్నారు.. మరోపక్క వైసీపీ ఎమ్మెల్యేలు, ప్రతినిధులు ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం సాగిస్తున్నారు. ఇంకోవైపు వలంటీర్ల ద్వారా సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ.. వై నాట్ 175 అన్న జగన్ పార్టీ.. ఇప్పుడు 75 సీట్లు పొందడం కూడా కష్టమే అన్న ప్రచారం జరుగుతోంది. సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అయితే.. 45 సీట్లు కూడా కష్టమని జోస్యం చెప్పారు. ఇదిలాఉండగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ పార్టీకి ఓటమి తప్పదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కుంటబద్దలు కొట్టినట్లు చెప్పారు. ప్రశాంత్ ప్రకటనతో వైసీపీ షాక్‌కు గురైంది.
తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో అధికార పార్టీ ఆందోళనలో ఉంది. గెలుపు కోసం ఏం చేయాలనే దానిపై అంతర్మథనం చెందుతోంది. ఈక్రమంలో ముఖ్యనేతలతో జగన్ సమాలోచనలు చేస్తున్నారు. ఐదేళ్లలో చేసిన పొరపాట్లు, దిద్దుబాట్లు చర్యలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే.. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మళ్ళీ అధికారాన్ని చేపట్టేందుకు పార్టీ తన కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. త్వరలో వారితో సమావేశాలు నిర్వహించాలని నేతలకు ఆదేశించినట్లు సమాచారం. 2019 ఎన్నికల్లో అధికారంలోకి రావటానికి జగన్ పాదయాత్ర చేశారు. కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపారు. కార్యకర్తలు యుద్ధంలో సైనికుల లాగా పనిచేశారు. దాంతో వైసీపీ తిరుగులేని విజయం సాధించింది. భారీ మెజార్టీతో అధికారం దక్కించుకుంది. 2024 ఎన్నికల్లో కూడా ఇదే సూత్రం అమలు చేయాలని భావిస్తున్నారు.
దీంతో పాటు సిద్ధం సభల ద్వారా నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలను అమలు చేసిన తీరు, చేసిన ఖర్చు, అవినీతిలేని పాలనను విస్తృతంగా ప్రజల దృషికి తీసుకెళ్లాలని ప్రణాళికలు రచిస్తున్నారు. సమయం తక్కువ ఉండడంతో వీలైనంత ఎక్కవ సమయం ప్రజల్లో ఉండాలని నాయకులకు, కార్యకర్తలకు జగన్ దిశానిర్దేశం చేశారు. తమ సంక్షేమ పథకాలపై ప్రతిపక్షాలు, చంద్ర బాబు అండ్ కో చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఏ విధంగా తిప్పికొట్టాలి, తమ పార్టీ అందించిన సంక్షేమ ఫలాలు ఎంతమందికి అందాయి, వంటి వివరాలను ప్రజలకు ఎలా తెలియచేయాలి అనే అంశం మీద కసరత్తు తీవ్రం చేశాయి.
గతానికి, ఇప్పటికి పార్టీపై ఆదరణ తగ్గుతోందన్న ప్రచారాన్ని తిప్పికొట్టేలా.. భారీ జనసమీకరణతో సభలు నిర్వహించాలని అధికార పార్టీ యోచిస్తోంది. ఎన్నికలు సమీపిస్తుండడంతో వీలైనన్ని ఎక్కువ సభల ద్వారా ప్రచారం సాగించాలని వ్యూహం రచిస్తున్నారు. సభల ద్వారా జగన్.. తన ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ, ప్రతీ కార్యకర్తా.. తమ తమ నియోజక వర్గాల్లో ఈ పథకాల గురించి బాగా ప్రచారం చెయ్యాలని అధినేత చెబుతున్నారు. టీడీపీ-జనసేన కూటమికి పెరుగుతున్న ఆదరణ, ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలను వైసీపీ సీరియస్‌గా పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి మున్ముందు రాజకీయ పార్టీల తీరు ఎలా మారుతుందో వేచి చూడాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE




































