ఏపీ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు దూకుడుగా ముందుకెళ్తున్నారు. వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటూ తన మార్క్ చూపిస్తున్నారు. తాజాగా అమరావతిపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. గత వైసీపీ ప్రభుత్వం రాజధాని అమరావతిపై ఎలా వ్యవహరిస్తుందో వివరించారు. అలాగే ప్రస్తుత అమరావతి పరిస్థితిన కూడా వివరిస్తూ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. రాష్ట్ర విభజన జరుగుతుందని.. విభజన తర్వాత ఏపీకి అమరావతే రాజధాని అవుతుందన్న ఎవరూ ఊహించలేదని చంద్రబాబు వివరించారు. ప్రతి గ్రామం నుంచి మట్టి, నీరు తెచ్చి అమరావతిలో ఉంచామని.. యమునా నది నీరు, పార్లమెంట్ మట్టిని ప్రధాని మోడీ తెచ్చారన్నారు. అక్కడ ఎంతో సెంటిమెంట్ ఉందని.. పవిత్ర దేవాలయాల్లోని మట్టిని తీసుకొచ్చి అమరావతికి శంకుస్థాపన చేశామని వివరించారు. అందుకే అమరావతిని ఎవరూ కదిలించలేకపోయారని పేర్కొన్నారు.
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్, సికింద్రాబాద్ రెండు సీటీలు మాత్రమే ఉండేవన్నారు. తన హయాంలోనే మూడో సిటీ సైబారాబాద్ డెవలప్ అయిందని తెలిపారు. హైదరాబాద్‌కు తాగునీటి, కరెంట్ కష్టాలను తీర్చామన్నారు. హైదరాబాద్‌కు కృష్ణాజలాలను తీసుకొచ్చి చరిత్ర తిరగరాశామని వెల్లడించారు. ఆ అనుభవంతోనే అమరావతిని రాజధానిగా తీర్చిదిద్దాలని నిర్ణయించినట్లు వివరించారు. రాజధానికి అమరావతి అని పేరు పెట్టాలని రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీ రావు సూచించారని అన్నారు. రాష్ట్రంలో ఎటు చూసినా సమదూరంలో అమరావతి ఉందని.. అందుకే రాజధానిగా ఆ ప్రాంతాన్ని ఎంపిక చేశామన్నారు. హైదరాబాద్ మాదిరిగానే అమరావతిని కూడా అభివృద్ధి చేసి తీరుతామని చంద్రబాబు వివరించారు. బ్రిటీష్ మ్యూజియంలో కూడా అమరావతికి గ్యాలరీ ఉందని తెలిపారు.
అమరావతిని రాజధానిగా తీర్చిదిద్దేందుకు ల్యాండ్ పూలింగ్ ఒక్కటే మార్గంగా కనిపించిందని చంద్రబాబు అన్నారు. 29 వేల మంది రైతులు 34,400 ఎకరాలు రాజధాని కోసం ఇచ్చారని చెప్పారు. రైతులు ఇచ్చింది.. ప్రభుత్వ భూమి కలిపి మొత్తం 53,745 ఎకరాల భూమిని రాజధాని కోసం సేకరించామన్నారు. వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్, ఎకానమిక్ పవర్ హౌస్, హైటెక్ అండ్ నాలెడ్జ్ బేస్డ్ ఇండస్ట్రీ జాబ్స్, గ్లోబల్లీ కాంపిటేటివ్, రిఫ్లెక్ట్ రిచ్ హెరిటేజ్ పొసెస్డ్ బై ది రీజియన్, షో కేస్ యూనిక్ ఐడెంటిటీ, సస్టైనబిలిటీ, ఎఫిషియంట్ మేనేజ్ మెంట్ ఆఫ్ రిసోర్సెస్ ఇవన్నీ అమరావతిలో,చుట్టుపక్కల ప్రాంతాల్లో తీసుకొచ్చి డెవలప్ చేయాలని ప్లాన్ చేసినట్లు తెలిపారు. ప్రపంచంలోనే అన్ని నగరాలకంటే బెస్ట్ సిటీగా అమరావతిని తీర్చి దిద్దేందుకు ప్రణాళికలు రచించామన్నారు.
గతంలో అమరావతే రాజధానిగా ఉండాలన్న జగన్.. సీఎం అవ్వగానే మూడు రాజధానులంటూ మాట మార్చారని మండిపడ్డారు. అమరావతి అభివృద్ధిని పక్కన పెట్టేశాడన్నారు. తమ హయాంలో సింగపూర్ మాదిరిగా అమరావతిని డెవలప్ చేసేందుకు ప్రపంచ దేశాల నుంచి అనేక కంపెనీలు ఫండ్స్‌తో ముందుకొచ్చాయని వివరించారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ కంపెనీలను తరిమేశారని మండిపడ్డారు. అమరావతి అభివృద్ధి ఆగిపోవడంతో అన్ని రంగాలు దెబ్బ తిన్నాయని తెలిపారు. చిన్న చిన్న పనులు కనీసం కూలి పనులకు కూడా ఉన్న ఊరిని విడిచి పెట్టి హైదరాబాద్‌కు వెళ్లాల్సిన పరిస్థితిని గత ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. అమరావతి రైతులను అనేక రకాలుగా గత ప్రభుత్వం అవమానించిందని.. రాజధాని కోసం భూమి ఇచ్చి రైతులు రోడ్డున పడ్డారని చంద్రబాబు తెలిపారు. అమరావతి రైతుల త్యాగం చరిత్ర గుర్తు పెట్టుకుంటుందని వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE