ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చే ఆగస్ట్ నుంచి గ్రామాల్లో పర్యటించేందుకు సిద్ధం అవుతున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది లోనే రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు అమలులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పథకాలు అమలుపై ప్రజల నుంచి స్పందన తెలుసుకోవాలని సీఎం వైఎస్ జగన్ భావిస్తున్నారు. జూన్ 11, గురువారం నాడు గ్రామ, వార్డు సచివాలయాల్లో అందించే సేవలు, విధివిధానాలపై సీఎం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆగస్ట్ నుంచి గ్రామాల్లో పర్యటిస్తానని, అప్పుడు ప్రజలు ఎవరూ కూడా సంక్షేమ పథకాలు అందలేదని ఫిర్యాదులు చేయకూడదని ఆయన అధికారులకు స్పష్టం చేశారు. ప్రస్తుతం వ్యవస్థలో జవాబుదారితనం, పారదర్శకత, బాధ్యత ముఖ్యమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అవినీతి, వివక్షకు తావులేకుండా అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకాలు అందాలని, ఒకవేళ అర్హత కలిగిన వారికీ పథకాలు అందకపోతే సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu