ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 2 వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభించాలని నిర్ణయించినట్లు ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తిపై అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, పాఠశాలలను మూడు దశల్లో ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థులకు రోజు విడిచి రోజు తరగతులు నిర్వహించనున్నారు. ఈ మేరకు పాఠశాలలు ప్రారంభం, తరగతుల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ ను ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని గురువారం నాడు విడుదల చేశారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ విద్యా సంస్థలు ఇదే షెడ్యూల్ పాటించాలని సూచించారు.
కరోనా వ్యాప్తితో మూసివేసిన పాఠశాలలు, కాలేజీలు నవంబర్ 2 నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయని పేర్కొన్నారు. నవంబర్ 2 వ తేదీ నుంచి 9,10, ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులకు తరగతులును రోజు విడిచి రోజు నిర్వహిస్తారు. తరగతులు హాఫ్‌డే వరకే జరగనున్నాయి. అలాగే నవంబర్ 23 వ తేదీ నుంచి 6,7,8 విద్యార్థులకు తరగతులు ప్రారంభం కానున్నాయి, వీరికి కూడా రోజు విడిచి రోజు, హాఫ్ డే వరకు మాత్రమే క్లాసులు నిర్వహిస్తారు. ఇక 1 నుంచి 5 వ తరగతి విద్యార్థులకు డిసెంబర్ 14 నుండి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. మరోవైపు ఇతర ఉన్నత విద్యకు సంబంధించి అన్ని కాలేజీల్లో కూడా నవంబర్ 2 నుంచే తరగతులు ప్రారంభమవుతాయని, రొటేషన్ పద్ధతిలో తరగతుల నిర్వహణ జరుగుతుందని షెడ్యూల్ లో పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu