కరోనా వైద్య చికిత్సలకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే అధికంగా వసూలు చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ హెచ్చరించారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధిక ఫీజులు వసూలు చేసిన ప్రైవేటు ఆసుపత్రులపై పెనాల్టీ విధించామని చెప్పారు. ఇటీవలే కరోనా వైద్య చికిత్సలకు అందజేసే ఫీజుల రేటు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిందని, ఇతర రాష్ట్రాలతో పోల్చి చూసుకుంటే ఏపీలో పెంచిన ఫీజులు రీజనబుల్ గా నిర్ణయించామన్నారు. ఆరోగ్యశ్రీ కింద అందించే సేవలకు కూడా పెంచిన ఫీజులనే చెల్లిస్తున్నామని తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రులు ఇచ్చే బిల్లులను నోడల్ అధికారులు, వారి బృందాలు మానటరింగ్ చేయాలని అయిదుగురు మంత్రుల సబ్ కమిటీ ఆదేశించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరలు కంటే అధికంగా వసూలు చేస్తే సహించేది లేదని స్పష్టంచేశారు.
కరోనా థర్డ్ వేవ్ పై కమిటీ:
కరోనా థర్డ్ వేవ్ పై మీడియాలో నిపుణులు నుంచి వస్తున్న సూచనలను పరిగణలోనికి తీసుకుని సీనియర్ అధికారులతో ఒక కమిటీని నియమించాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. ఆ కమిటీ కరోనా థర్డ్ వేవ్ వస్తే, ఎదుర్కొనడానికి అవసరమైన ఐసీయూ బెడ్లు ఏర్పాటుతో పాటు మందుల కొనుగోలుపై వారం రోజుల్లో రిపోర్టు ఇవ్వనుందన్నారు. ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారన్నారు. మరోవైపు కృష్ణపట్నం మందుపై ఇంకా రిపోర్టులు రావాల్సి ఉందన్నారు.
బ్లాక్ ఫంగస్ నివారణకు అంఫోటెరిసిన్-బి, పొసకొనజోల్ ఇంజక్షన్ల అందజేత:
రాష్ట్రంలో గురువారం వరకు 579 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. బ్లాక్ ఫంగస్ నివారణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి గురువారం మధ్యాహ్నం మరో 1800 అంఫోటెరిసిన్-బి ఇంజక్షన్లను వచ్చాయని, వాటిని అన్ని జిల్లాలకు పంపిణీ చేశామని తెలిపారు. ఇదివరకే కేంద్రం అందజేసిన 3 వేల పైబడిన అంఫోటెరిసిన్-బి ఇంజక్షన్లను అన్ని జిల్లాలకు సరఫరా చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అంఫోటెరిసిన్-బి ఇంజక్షన్లతో పాటు కేంద్ర ప్రభుత్వం అందజేసిన పొసకొనజోల్ 240 ఇంజక్షన్లు, 8,340 ట్యాబెట్లు కూడా జిల్లాలకు పంపిణీ చేశామన్నారు.
మొత్తం 84,13,616 వ్యాక్సిన్ డోసుల పంపిణీ:
ప్రతి జిల్లాలోనూ కొవాగ్జిన్ సెకండ్ డోసు, కొవిషీల్డ్ ఫస్ట్ డోసు రాష్ట్ర వ్యాప్తంగా వేస్తున్నామన్నారు. రాబోయే నాలుగు రోజుల్లో ఉన్న వ్యాక్సిన్లను వేయాలని ఆదేశించామన్నారు. బుధవారం రెండున్నర లక్షల మందికి టీకాలు వేయగా, ఇప్పటి వరకు మొత్తం 84,13,616 వ్యాక్సిన్లు వేశామన్నారు. వాటిలో 23,81,900 మందికి రెండు డోసులు వేయగా, 36,49,816 మందికి ఫస్ట్ డోసు పంపిణి చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం దగ్గర 1,41,774 కొవాగ్జిన్, 13,88,610 కొవిషీల్డ్ డోసులు ఉన్నాయన్నారు. మే నెలలో 83,759 మందికి కొవాగ్జిన్ సెకండ్ డోసు, కొవిషీల్డ్ 13.85 లక్షల ఫస్ట్ డోసుగా వేస్తున్నామన్నారు. జూన్ నెలకు సంబంధించి ఆ నెల 15వ తేదీలోగా కేంద్రం నుంచి 5,90,140 డోసుల కొవిషీల్డ్, 1,77,870 కొవాగ్జిన్ డోసులు రానున్నాయన్నారు. ఆ డోసులతో పాటు ప్రస్తుతం రాష్ట్రం వద్ద ఉన్న డోసులతో కలిపి 24,62,000 డోసులు అందుబాటులోకి రానున్నాయని అనిల్ కుమార్ సింఘాల్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ