ఎవ‌రికీ న‌చ్చ‌లే.. అయినా అత‌డికే సీటు..?

P.gannavaram, mahasena rajesh, ap elections, tdp,janasena,pawan kalyan,chandrababu naidu,Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics, andhra pradesh,AP,Mango News Telugu,Mango News
P.gannavaram, mahasena rajesh, ap elections, tdp

రానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీచేయ‌బోయే అభ్య‌ర్థుల‌తో తెలుగుదేశం – జ‌న‌సేన ప్ర‌క‌టించిన ఉమ్మ‌డి తొలి జాబితాలోని మెజారిటీ నియోజ‌క‌వ‌ర్గాల్లో వాతావ‌ర‌ణం ప్ర‌శాంతంగానే ఉంది. అయితే కొన్నిచోట్ల నిర‌స‌న‌లు వ్య‌క్తం అవుతున్నాయి. అలాంటి వాటిలో పి.గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక‌టి. టీడీపీ బ‌లం ఉన్న‌చోట జ‌న‌సేన‌కు ఇచ్చార‌ని, జ‌న‌సేన బ‌లం ఉన్న‌చోట టీడీపికి ఇచ్చార‌ని కొన్నిచోట్ల ఆందోళ‌న‌లు కొన‌సాగుతుంటే.. స్థానికంగా ఇరు  పార్టీల కార్య‌క‌ర్త‌ల‌కూ న‌చ్చ‌ని వానికి టికెట్ ప్ర‌క‌టించ‌డం గ‌న్న‌వ‌రం రాజ‌కీయం గ‌రం కావ‌డానికి కార‌ణ‌మైంది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాకు చెందిన‌ పి.గన్నవరం (ఎస్సీ) నియోజకవర్గ టీడీపీ అభ్య‌ర్థిగా సరిపెల్ల రాజేశ్ అలియాస్ మహాసేన రాజేష్‌ను ప్ర‌క‌టించిన నాటి నుంచీ అక్క‌డ వాతావ‌ర‌ణం వేడెక్కింది.

ప్ర‌ధానంగా జ‌న‌సేన నాయ‌కులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. అందుకు పెద్ద కార‌ణ‌మే ఉంది. గత ఎన్నికల్లో పి. గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి జ‌నసేన ఒంటరిగా పోటీ చేసింది. జ‌న‌సేన అభ్య‌ర్థికి 36వేలకు పైగా ఓట్లు పడ్డాయ్. టీడీపీకి 45వేలకు పైగా ఓట్లు వచ్చాయ్. జనసేన బలంగా ఉన్న స్థానాల్లో పి.గన్నవరం ఒకటి. అలాంటి నియోజకవర్గాన్ని హోల్డ్‌ చేసుకోవాల్సింది పోయి.. టీడీపీకి అప్పగించడాన్ని జ‌న‌సేన నాయ‌కులు సైతం జీర్ణించుకోలేక‌పోతున్నారు. అంతేకాకుండా, టీడీపీ నుంచి సీనియర్‌ నేతకో.. బలమైన నాయకుడికో టికెట్ ఇచ్చారా అంటే.. యూట్యూబర్‌ మహాసేన రాజేశ్‌కు కేటాయించ‌డం అగ్గిమీద గుగ్గిలం కావ‌డానికి కార‌ణం అవుతోంది. మహాసేన రాజేశ్‌కు కాకుండా.. మరెవరికి టికెట్ ఇచ్చినా ఇంత బాధ పడేవాళ్లం కాదని.. అతన్ని ఓడించి తీరుతామని.. జనసైనికులు బహిరంగంగానే చెప్తున్నారు.

ఎందుకంటే.. యూట్యూబ్‌ చానెల్ వేదికగా పొలిటికల్‌ అప్డేట్స్‌పై తన మార్క్ ఎనాలలిస్ ఇచ్చే మహాసేన రాజేశ్‌.. ఆ మధ్య పవన్‌ను, జనసేనపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. మాటలు హద్దులు దాటి బూతుల వరకు వెళ్లాయ్‌. చెప్పలేని విధంగా ప‌వ‌న్  పై రాజేష్ నోరుపారేసుకున్నారు. ఇప్పుడు అలాంటి వ్య‌క్తికి జనసేనకు బలంగా ఉన్న‌చోట టికెట్ కేటాయించ‌డం స్థానికంగా జ‌న‌సైనికుల‌కు కూడా ఆగ్ర‌హం తెప్పిస్తోంది. రాజేశ్ కు గన్నవరం కేటాయిస్తుంటే ఎలా ఒప్పుకొన్నావ్ అన్నయ్యా.. అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. రాజేశ్‌కు కేటాయించడానికి జనసేనతో పాటు టీడీపీ కార్యకర్తలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో అంబాజీపేట వాసవి కన్యకాపరమేశ్వరి కల్యాణ మండపంలో టీడీపీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అన్ని మండ‌లాల‌ టీడీపీ, జ‌న‌సేన  కార్య‌క‌ర్త‌ల అభిప్రాయాల‌ను సేక‌రించారు. మహాసేన రాజేశ్‌కు టికెట్‌ రద్దు చేయాలని మెజారిటీ మంది అభిప్రాయ ప‌డిన‌ట్లు తెలిసింది.

లోపల గదిలో ఉన్న హరీశ్‌ బయటకు వచ్చి బుజ్జగించేందుకు ప్రయత్నిస్తుండగా.. జన సైనికులు ఆయనపై విరుచుకుపడ్డారు. టీడీపీ శ్రేణులను తోసుకుంటూ ప్రత్యేక గదిలో సమావేశమైన టీడీపీ నేతలు రంగారావు, రెడ్డి అనంతకుమారి వద్దకు చొచ్చుకువెళ్లారు. పరిస్థితి చేజారడంతో రంగారావు, అనంతకుమారి, సుభాన్‌లను టీడీపీ నాయకులు గదిలో ఉంచి తలుపులు వేశారు. హాలు బయట ఉద్రిక్తత నెలకొంది. జనసైనికులు అక్కడే ఉన్న హరీశ్‌ కారు అద్దాలను ధ్వంసం చేశారు. వెంటనే టీడీపీ, జనసేన నేతలు జోక్యం చేసుకుని సర్దుబాటు చేశారు. పోలీసులు కూడా రంగప్రవేశం చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఇటువంటి ప‌రిస్థితుల్లో పి.గ‌న్న‌వ‌రం టికెట్ రాజేష్ కే కేటాయిస్తారా, మారుస్తారా అనేది ఆస‌క్తిగా మారింది. టికెట్ మార్చ‌కుండా అత‌డినే కొన‌సాగిస్తే జ‌న‌సేన స‌హ‌కారం ఉంటుందా లేదా అనేదానిపై ఉత్కంఠ ఏర్ప‌డింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE