
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, నారా చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేశ్ గెలుపుపై ఈసారి భారీ అంచనాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఓటమి చవిచూడడంతో ఈసారైనా విజయం సాధిస్తారా.. అనే చర్చలు జరుగుతున్నాయి. ఈక్రమంలో ఏపీలో అందరి చూపూ మంగళగిరిపై పడింది. దీంతో ఆ నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గత ఎన్నికల్లో మాదిరిగానే నారా లోకేశ్‌ను ఇక్కడ ఓడించాలని వైసీపీ లక్ష్యంగా పెట్టుకున్నది. ఈక్రమంలో దీటైన అభ్యర్థిని నిలబెట్టేందుకు గట్టి కసరత్తే చేసింది. గత ఎన్నికల్లో లోకేశ్‌పై గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డికే మళ్లీ టికెట్ ఇస్తే.. సింపతీపై లోకేశ్ గెలిచే అవకాశం ఉందని వైసీపీ భావించింది. బలమైన అభ్యర్థే అయినప్పటికీ.. ఈ సమీకరణాల వల్లే ఆళ్లకు మరోసారి టికెట్ కేటాయించలేదు.
సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుని.. తొలుత గంజి శ్రీనివాస్‌కు వైసీపీ మంగళగిరి టికెట్ కేటాయించింది. ఈక్రమంలో ఆళ్ల వైసీపీకి రాజీనామా చేసి.. కాంగ్రెస్‌లోకి వెళ్లడం.., మళ్లీ వైసీపీలోకి రావడం తెలిసిందే. ఆ తర్వాత.. అనూహ్యంగా గంజి శ్రీనివాస్‌ను తొలగించి.. మురుగుడు లావణ్యకు టికెట్ ఇచ్చింది. ఆళ్ల కూడా లావణ్య గెలుపునకు రంగంలోకి దిగారు. మంగళగిరిలో మళ్లీ వైసీపీ జెండా ఎగురవేస్తామని చెబుతున్నారు. ప్రచారంలో నాన్ లోకల్ అనే దాన్ని, వైసీపీ ఎక్కువగా వినియోగిస్తోంది. టీడీపీ నుంచి పోటీ చేస్తున్న నారా లోకేశ్‌ను ఉద్దేశించే ఈ ప్రచారం తెరపైకి వచ్చింది. లోకేశ్ ను ఎలాగైనా ఓడించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా మంగళగిరిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే ఆళ్ల పునరాగమనానికి జగన్ ఆసక్తి చూపినట్లు తెలిసింది.
లోకేశ్ పై మహిళను నిలబెట్టడం, లావణ్యది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కావడం వైసీపీకి కలిసి వస్తాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. లావణ్య తల్లి కాండ్రు కమల 2009 నుంచి 2014 వరకు మంగళగిరి ఎమ్మెల్యేగా పనిచేశారు. అంతకుముందు 2004లో మంగళగిరి మున్సిపల్ చైర్‌పర్సన్‌గానూ ఎన్నికయ్యారు. లావణ్య మామ మురుగుడు హనుమంతరావు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఎథిక్స్ కమిటీ చైర్మన్‌గానూ వ్యవహరిస్తున్నారు. గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్‌లోనూ పనిచేశారు. వారు లావణ్య గెలుపు కోసం వ్యూహప్రతివ్యూహాలు పన్నుతున్నారు. తమ బలాన్ని ఉపయోగించి లావణ్యను గెలిపించుకోవడానికి కసరత్తు చేస్తున్నారు.
మరోవైపు.. లోకేశ్ కూడా ఈసారి గెలిచి తీరాలని మంగళగిరిలోని ప్రాంతాల వారీగా ఆత్మీయ సమావేశాలు, బ్రేక్ ఫాస్ట్ మీటింగ్‌లు పెడుతున్నారు. గత ఎన్నికల్లో సమయాభావం వల్ల స్థానిక సమస్యలపై తనకు పూర్తి అవగాహన లేకపోవడం, తానేంటో ప్రజలకు పూర్తిగా తెలియకపోవడం వల్ల స్వల్ప మెజారిటీతో ఓడిపోవాల్సి వచ్చిందని చెబుతున్నారు. ఓడిపోయినా ఎక్కడికీ వెళ్లకుండా నియోజకవర్గాన్నే అంటిపెట్టుకుని ఉన్నానని, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ నియోజకవర్గంలో ఐటీ పరిశ్రమ రావడంలో, చేనేతల సమస్యల పరిష్కారానికి కృషి చేశానని ప్రచారం చేస్తున్నారు. ఒక్కచాన్స్ అని వైసీపీకి అధికారం కట్టబెట్టడం వల్ల జరిగిన విధ్వంసాన్ని గుర్తించాలంటూ ఓటర్లకు విజ్ఙప్తి చేస్తున్నారు. గతం కంటే.. విజ్ఞతతో వ్యవహరిస్తున్నారు. రాష్ట్రమంతా ఎన్ని పర్యటనలు ఉన్నా.., మంగళగిరికి కూడా సమయం కేటాయిస్తూ ప్రచారం సాగిస్తున్నారు. గత ఎన్నికల్లో కేవలం 5 వేల ఓట్లతో ఓడించారని, ఈసారి గెలిపించడం కాదు.. బ్రహ్మాండమైన మెజారిటీ ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు. స్థానికంగా వైసీపీ నేతలు చేసిన తప్పులను ఎత్తిచూపుతూ జరగనున్న ఎన్నికల్లో విజయావకాశాలను మెరుగుపరుచుకుంటున్నారు. మరి ప్రజాతీర్పు ఎలా ఉంటుంది అనేదానిపై ఉత్కంఠ ఏర్పడింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ