ఒకప్పుడు డబ్బున్న వాళ్లు మాత్రమే వేసుకునే చెప్పులు.. తర్వాత తర్వాత పేద, ధనిక వర్గంతో సంబంధం లేకుండా వేసుకుంటున్నారు. కాకపోతే తమ తాహతుకు తగ్గట్లు వాడుతున్నారు. అయితే కాళ్లకు రక్షణగా వాడేవాళ్లు కాస్తా..ఇప్పుడు మ్యాచింగ్ , స్టేటస్ అంటూ రకరకాల చెప్పులు, షూలు వాడేస్తున్నారు. బయటకు వెళ్లినప్పుడే కాదు.. ఇంట్లో కూడా చెప్పులు వేసుకోవడం అలవాటుగా మార్చేసుకున్నారు. అయితే చిత్తూరు జిల్లాకు చెందిన ఓ గ్రామంలో మాత్రం ఎవరూ చెప్పులే వేసుకోరు. అంతేకాదు ఆ గ్రామంలోకి ఎవరు వెళ్లినా కూడా ఆ ఊరి బయటే చెప్పులు విడిచిపెట్టి వెళ్లాలి.
అవును వినడానికి వింతగా ఉన్నా కూడా తిరుపతికి 50 కి.మీటర్ల దూరంలో గల పాకాల మండలం ఉప్పర పల్లి పంచాయతీలోని వేమన ఇండ్లు గ్రామంలో కొన్నేళ్లుగా ఇదే జరుగుతుంది. అందుకే చుట్టుపక్కల ఊళ్లవారు.. ఈ గ్రామం గురించి వింతగా చెప్పుకుంటారు. ఆ ఊళ్లో 25 కుటుంబాలు మాత్రమే నివిస్తున్నాయి. అయితే వీరిలో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ ఎవరు చెప్పులు వేసుకోరు. కలెక్టర్ కాదు కదా.. చివరకు ముఖ్యమంత్రి వచ్చినా ఊరి బయట చెప్పులు విప్పి..గ్రామంలోకి రావాల్సిందే. అంతగా వారంతా నమ్మే ఈ ఆచారం తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్న సాంప్రదాయమని గ్రామస్తులు చెబుతున్నారు.
వేమన ఇండ్లు గ్రామంలోకి వేరే గ్రామస్తులెవరినీ అనుమతించరు. గ్రామంలో ఉండేవారంతా పాలవేకారి, దొరవర్లు కులానికి చెందిన వారు. ఈ గ్రామస్తులంతా తమ ఆరాధ్య దైవం వేంకటేశ్వర స్వామిని కొలుస్తుంటారు. వేమన ఇండ్లు గ్రామంలో లక్ష్మీ నరసింహ స్వామి, గంగమ్మ తల్లికి కూడా ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అయితే వేంకటేశ్వరుడిపై ఉన్న భక్తితో.. తమ ముత్తాతలు మొక్కుకోవడం వల్ల ఇప్పటికీ తాము చెప్పులు వేసుకోవడం మానేశామని గ్రామస్తులు చెబుతారు.అంతేకాదు తప్పనిసరి పరిస్థితుల్లో ఊరికి ఎవరు వచ్చిన కూడా.. చెప్పులు విడిచి గ్రామంలోకి రావాల్సిందేనట.
అంతేకాదు వేమన ఇండ్లు గ్రామంలోకి వచ్చిన కొత్తవారిని వీరు కనీసం తాకనుకూడా తాకరట. ఒకవేళ వీరు బయటకు వెళ్లాల్సి వస్తే.. ఎన్ని రోజులు బయట ఉన్నా కూడా బయట ఆహారాన్ని తినరు. ముందే ఇంటి నుంచి ఆహారాన్ని వండించుకుని తీసుకుని వెళతారు. లేదంటే మళ్లీ తిరిగి ఇంటికి వచ్చిన తర్వాతే ఆహారం తీసుకుంటారు. చివరకు తిరుపతిలో తమ ఆరాధ్య దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువు తీరినా కూడా..ఈ గ్రామస్తులు అక్కడికి కూడా వెళ్లరట.
వేమన ఇండ్లు గ్రామంలో ఎవరికైనా అనారోగ్యం వచ్చినా కూడా ఊళ్లోనే ఉన్న వేంకటేశ్వర స్వామి గుడిలో పూజలు చేస్తారు తప్ప ఆసుపత్రికి మాత్రం తీసుకుని వెళ్లరట. అంతెందుకు ఈ గ్రామంలో వారు కోవిడ్ టైమ్‌లోనూ ఎవరూ కూడా వ్యాక్సిన్ తీసుకోలేదట. తాము కొలిచే వెంకన్నే వారి ప్రాణాలు కాపాడతాడని వారు నమ్మకంతోనే ఉన్నారట. ఈ గ్రామంలో పిల్లలు కూడా పెద్దవాళ్లు చెప్పినట్లే తాతముత్తాతల సాంప్రదాయాలు పాటిస్తారట. అయితే ఈ గ్రామం ఆచారాలు, సాంప్రదాయాలను చిన్నపిల్లలపై కూడా రుద్దడాన్ని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. మూఢనమ్మకాలతో వారిని కూడా చెడగొడుతున్నారని ఆరోపిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE