ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా శాప్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సమ్మర్ క్యాంపులను బుధవారం పర్యాటక, క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా ప్రారంభించారు. ఈరోజు ఉదయం ఆమె విజయవాడ లోని ఇందిరా గాంధీ స్టేడియంలో వేసవి క్రీడా శిక్షణా శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ.. గత రెండు సంవత్సరాలుగా కరోనా మహమ్మారి కారణంగా అందరం సరైన ఫిజికల్ యాక్టివిటీలు లేకుండా గడిపామని, ఇలాగే ఎక్కువ రోజులు కొనసాగితే దీనివలన భవిష్యత్తులో పలు అనారోగ్య సమస్యలు వస్తాయని పేర్కొన్నారు. క్రీడలలో పాల్గొనడం ద్వారా ఆరోగ్యం మెరుగవుతుందని, అందుకే స్పోర్ట్స్ క్యాంపులు ఏర్పాటు చేసి యువతను ప్రోత్సహిస్తామని మంత్రి రోజా తెలిపారు.
‘శాప్’ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా స్పోర్ట్స్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని, వీటి ద్వారా 48 క్రీడా అంశాలలో అత్యుత్తమ శిక్షణ అందిస్తామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 1670 సమ్మర్ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ శిబిరాలలో పాల్గొనడం ద్వారా విద్యార్థులు, క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదగవచ్చునని తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాలలోని మట్టిలో మాణిక్యాల వంటి ప్రతిభాకారులను గుర్తించి వెలుగులోకి తెస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి రోజా సూచించారు. కాగా ఈ కార్యక్రమానికి ‘శాప్’ ఛైర్మన్ బైరెడ్డి సిద్దారెడ్డి గైర్హాజరవడం విశేషం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ