రాజధాని రైతులకు వార్షిక కౌలు తక్షణమే చెల్లించాలి – పవన్ కళ్యాణ్

Amaravati Farmers, Andhra Pradesh, Annual Lease Amount to Capital Amaravati Farmers, Annual Lease To Farmers, Capital Amaravati Farmers, janasena chief pawan kalyan, pawan kalyan, Pawan Kalyan Appeals Govt to Pay Annual Lease Amount

కౌలు అడిగిన రాజధాని అమరావతి ప్రాంత రైతులను అరెస్ట్ చేయడం గర్హనీయమని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. రాజధాని రైతులకు వార్షిక కౌలు తక్షణమే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. “ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములు త్యాగం చేసిన రైతులకు వార్షిక కౌలు చెల్లింపులో ప్రభుత్వం జాప్యం చేస్తున్న తీరు భావ్యం కాదు. ఒప్పందం ప్రకారం-భూమి ఇచ్చిన ప్రతి రైతుకీ ఏప్రిల్ మాసంలో వార్షిక కౌలు చెల్లించాలి. ఒప్పందంలోని నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం గత యేడాది కూడా ఉల్లంఘించి ఆలస్యంగా ఇచ్చింది. వరుసగా రెండో యేడాది కూడా కౌలు చెల్లింపు జాప్యం చేస్తూ, ఆ సొమ్ములు వస్తాయో రావో అనే ఆందోళనలోకి రైతాంగాన్ని నెట్టేసింది. 28వేల మందికిపైగా రైతులు తమ భూములను రాజధాని కోసం ఇచ్చారు. వీరికి ఈ యేడాది రూ.189.7 కోట్లు కౌలుగా చెల్లించాల్సి ఉంది” అని పవన్ కళ్యాణ్ అన్నారు.

“ఎకరాకీ ప్రతి ఏటా రూ.3 వేలు మెట్టకీ, రూ.5 వేలు పెంచాల్సి ఉంది. సి.ఆర్.డి.ఏ. రైతులతో చేసుకొన్న ఒప్పందాన్ని గౌరవించాలి. కరోనా కష్ట సమయంలో సకాలంలో కౌలు చెల్లించాలని రైతులు అధికారులను కోరారు. జనసేన పార్టీ కూడా రైతుల పక్షాన కౌలు సకాలంలో ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. జూన్ 21వ తేదీన కౌలు విడుదల చేస్తున్నట్లు రెండు జీవోలను జారీ చేసినా ఏ రైతు ఖాతాలోకీ కౌలు మొత్తం రాలేదు. ఆ జీవోలు వచ్చి రెండు నెలలు దాటినా సాంకేతిక కారణాలు చూపిస్తూ ఆ సొమ్ము చెల్లించకపోవడం రైతులను క్షోభకు గురి చేయడమే అవుతుంది. తమ ప్రాంతంలో రాజధాని నిలుపుకోవడం కోసం 250 రోజులకి పైబడి రైతులు పోరాటం చేస్తున్నారు. ఆ రైతులకు న్యాయం చేయాల్సిన తరుణంలో వార్షిక కౌలు కూడా చెల్లించకుండా జాప్యం చేయడం ఒప్పందం ఉల్లంఘనే అవుతుంది. ఆ కౌలు మొత్తం అడిగేందుకు సి.ఆర్.డి.ఏ. కార్యాలయానికి వెళ్ళిన 180 మంది రైతులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడాన్ని ఖండిస్తున్నాను. తమకు న్యాయంగా రావాల్సిన కౌలు అడిగిన రైతులను అరెస్ట్ చేసిన తీరు గర్హనీయం. తక్షణమే రైతులకు రావాల్సిన కౌలు ఇచ్చి ఒప్పందాన్ని గౌరవించాలి” అని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu