
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని ఎస్టీ రిజర్వుడు స్థానమైన పాలకొండలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో రాజకీయాలు రోజురోజుకు హీటెక్కుతున్నాయి. పాలకొండ నియోజకవర్గంలో ముందు నుంచి వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య ప్రధాన పోరు కొనసాగుతూ వచ్చింది. అదే సమయంలో తన తండ్రి మాజీ ఎమ్మెల్యే నిమ్మక గోపాలరావు చరిష్మాతో రాజకీయాల్లోకి వచ్చిన జయకృష్ణకు సొంత పార్టీ నాయకుల నుంచే అసమ్మతి పోరు ఎదురయింది.
కానీ పార్టీలోని ఓ వర్గం జయకృష్ణ నాయకత్వాన్ని కాదంటూ సామాజిక కార్యకర్తగా ఉన్న పడాల భూదేవిని ప్రోత్సహిస్తూ వచ్చింది. టీడీపీ టికెట్‌ను ఆశిస్తూ నియోజకవర్గంలో జయకృష్ణకి పోటీగా భూదేవి పర్యటిస్తూ వచ్చారు. జయకృష్ణకి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కళా వెంకటరావు అనుచరుడుగా పేరుండగా.. భూదేవికి అచ్చెన్నాయుడు ప్రోత్సాహం ఉన్నట్లు తెలుస్తోంది
అయితే వీటన్నిటినీ కుటుంబ సమస్యలుగానే భావించిన జయకృష్ణ.. ఎన్నికల సమయానికి అధిష్టానం కలుగజేసుకుని అసమ్మతిని సద్దుమనిగిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. కానీ కళా వెంకట్రావు అనుచరుడైన జయకృష్ణకు చెక్ పెట్టాలన్న ఆలోచనో లేక నిజంగానే టీడీపీ అధిష్టానం సర్వేల ఫలితమో తెలియదు కానీ పొత్తులో భాగంగా అనూహ్యంగా పాలకొండ సీటును జనసేనకు కేటాయించారు చంద్రబాబు.
పాలకొండ టికెట్‌ను జనసేనకు కేటాయించటంతో టీడీపీలోని జయకృష్ణకి, భూదేవికి చెక్ పడిందని .. ముందు నుంచి జనసేనలో ఉన్న ఎస్బీఐ మాజీ ఉద్యోగి నాగేశ్వరావుకు టికెట్ వస్తుందని అనుకున్నారు. దీనికి ఊతమిచ్చినట్లుగానే అధిష్టానం కూడా నాగేశ్వరరావును విజయవాడకి పిలిచి ఎన్నికల్లో పోటీకి దిగితే తట్టుకునే సామర్థ్యంపై చర్చించినట్లు వార్తలు వినిపించాయి. కానీ పడాల భూదేవి తన వర్గం నేతలతో కలిసి మూడు రోజుల క్రిందట జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసి ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని హామీ ఇస్తే పార్టీలో చేరుతానని చెప్పారన్న వార్తలు హాట్ టాపిక్ అయ్యాయి.
పవన్ కళ్యాణ్‌ను భూదేవి కలిసిన విషయం తెలిసిన నిమ్మక జయకృష్ణ కూడా తాజాగా తన అనుచరులతో కలిసి జనసేనానిని కలిశారు. తాను కూడా తన వర్గంతో కలిసి జనసేనలో చేరుతానని..పాలకొండ టికెట్ తనకైనా తాను ప్రపోజ్ చేసిన వ్యక్తికి అయినా ఇవ్వాలని కోరారట. ఇలా ఈ రెండు వర్గాలు పవన్ సమక్షంలో జనసేన పార్టీలో చేరడానికి సిద్ధం అవ్వగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారిద్దరికీ ఓ కండిషన్ పెట్టారట.
టీడీపీలోని రెండు వర్గాలను జసేనలోకి చేర్చుకుంటే అది పొత్తు ధర్మానికి విరుద్ధమని భావించి..చంద్రబాబుతో కూడా ఈ విషయాన్ని చర్చించి వారిద్దరిలో ఒకరిని జనసేనలోకి చేర్చుకొని వారికే టికెట్ కేటాయిస్తానని చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మళ్లీ పడాల భూదేవి, ఇటు నిమ్మక జయకృష్ణ వర్గాలు ఎవరికి వారే తమకే జనసేన టికెట్ అంటూ నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారట. దీంతో ఇంతవరకు తెలుగుదేశం పార్టీలో ఉన్న గ్రూపుల పంచాయితీ ఇప్పుడు జనసేన పంచకు వచ్చి చేరిందా అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE