ఏపీలో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. రెండు, మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్నట్లు ఈసీ నుంచి బలమైన సంకేతాలు అందుతున్నాయి. అటు ప్రధాన పార్టీలన్నీ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే ఎన్నికల గడువు దగ్గరపడుతున్నకొద్దీ జనసేనాని పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది ఆసక్తికరంగా మారుతోంది. ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేయబోయే స్థానానికి సంబంధించి రోజుకో కొత్త నియోజకవర్గం పేరు తెరపైకి వస్తోంది.
వైసీపీని ఢీ కొట్టేందుకు ఈసారి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని జనసేన ఎన్నికలకు వెళ్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే సీట్ల సర్దుబాటుకు సంబంధించి రెండు పార్టీలు ఓ అంచనాకు కూడా వచ్చాయట. ఇక పవన్ కళ్యాణ్ తాను పోటీ చేయబోయే స్థానంపై కసరత్తు చేస్తున్నారట. 2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం రెండు చోట్ల నుంచి పవన్ పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఈక్రమంలో ఆ స్థానాల నుంచి కాకుండా.. ఈసారి కాకినాడ నుంచి పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
అయితే ఆ తర్వాత పిఠాపురం,తిరుపతి స్థానాలు కూడా పరిశీలనలోకి వచ్చాయని.. దాదాపు పిఠాపురం నుంచే పవన్ పోటీ చేస్తారని ఊహాగాణాలు వినిపించాయి. ఇప్పుడు అనూహ్యంగా మరో కొత్త నియోజకవర్గం పేరు తెరపైకి వచ్చింది. వచ్చే ఎన్నికల్లో కృష్ణాజిల్లాలోని విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. పవన్ ఆ స్థానం నుంచి పోటీ చేయడం ద్వారా ఆ ప్రభావం కృష్ణా జిల్లా మొత్తం మీద ఉంటుందని జనసైనికులు అంటున్నారు.
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కాపుల ఓట్లు అత్యధికంగా 45 వేలు ఉన్నాయి. బీసీ ఓటర్లు కూడా ఇక్కడ ఎక్కవగానే ఉన్నారు. అలాగే 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందింది. ప్రజారాజ్యం తరపున పోటీ చేసిన ఎలమంచిలి రవి.. 30 వేలకు పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అంతేకాకుండా 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తెలుగు దేశం పార్టీ ఆ నియోజకవర్గం నుంచి గెలుపొందింది. అందుకే జనసేనాని చూపు ఈ నియోజకవర్గంపై పడిందట.
ప్రస్తుతం ఆ స్థానం నుంచి టీడీపీ తరుపున సిట్టింగ్ ఎమ్మెల్యే రామ్మోహన్ రావు ఉన్నారు. కానీ పొత్తులో భాగంగా ఆ నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించేందుకు టీడీపీ కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. అటు గద్దె రామ్మోహన్ రావును పెనమలూరు నుంచి పోటీ చేయించనున్నారట. ఈ పరిణామాల మధ్య పవన్ కళ్యాణ్ ఆ స్థానం నుంచి పోటీ చేయడం దాదాపు ఖరారయినట్లేనని తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE