RRR టైటిల్‌ లోగో, మోషన్‌ పోస్టర్‌ విడుదల

RRR Title Logo and Motion Poster Released

బాహుబలి సృష్టించిన సంచలనాల తరువాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మరో ప్రతిష్టాత్మక చిత్రం ఆర్‌ఆర్ఆర్‌. రామ్ చరణ్, ఎన్టీఆర్‌ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్‌ కొమరం భీం పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్ర విశేషాల కోసం దేశవ్యాప్తంగా అభిమానులు, సినిమా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో శార్వరి నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా బుధవారం నాడు ఈ చిత్రం యొక్క టైటిల్‌ లోగోతో పాటుగా మోషన్‌ పోస్టర్‌ను కూడా చిత్రబృందం విడుదల చేసింది. ఈ చిత్రానికి RRR(రౌద్రం రణం రుధిరం) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. చిత్ర బృందం విడుదల చేసిన మోషన్ పోస్టర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. సరికొత్త స్క్రీన్ ప్లే, చిత్రీకరణతో దర్శకుడు రాజమౌళి మరోసారి ప్రేక్షకులకు కనువిందు చేయడం ఖాయంగా కనిపిస్తుంది.

ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌కు జోడిగా బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌ నటిస్తుండగా, ఎన్టీఆర్‌ సరసన హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరిస్‌ నటిస్తుంది. ఇక మెయిన్ విలన్ పాత్రలను హాలీవుడ్‌ నటుడు రే స్టీవ్‌సన్‌, ఐరిష్ నటి అలిసన్ డూడీ పోషిస్తున్నారు. అలాగే బాలీవుడ్‌ స్టార్ హీరో అజయ్‌ దేవగన్‌, తమిళ నటుడు సముద్రఖని కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ తారాగణంతో కూడిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం విడుదల కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఆర్‌ఆర్ఆర్‌ చిత్రాన్ని జనవరి 8 , 2021 న ప్రపంచవ్యాప్తంగా 10 భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.