ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ చేసిన వ్యాఖ్యలు భారతదేశంలో సెగలు రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. దీనిపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత ప్రధానిని విమర్శించే అర్హత పాకిస్తాన్ దేశానికీ లేదని, అది ముందు ‘మేక్ ఇన్ పాకిస్తాన్ టెర్రరిజం’ను ఆపాలని సూచించారు. న్యూయార్క్, ముంబై, పుల్వామా, పఠాన్‌కోట్ మరియు లండన్ వంటి నగరాలు పాకిస్తాన్ ప్రాయోజిత, మద్దతు మరియు ప్రేరేపిత ఉగ్రవాదం యొక్క మచ్చలను చరిత్ర నుంచి తుడిచివేయలేదు అని మండిపడ్డారు. భుట్టో వ్యాఖ్యలతో పాకిస్తాన్ వైఖరి ఏంటో ప్రపంచానికి మరోసారి స్పష్టమైందని, ఒసామా బిన్ లాడెన్‌ను అమరవీరుడని కీర్తిస్తూ, లఖ్వీ, హఫీజ్ సయీద్, మసూద్ అజార్, సాజిద్ మీర్, దావూద్ ఇబ్రహీం వంటి ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నందుకు ఆ దేశం సిగ్గుపడాలి అని బాగ్చీ అన్నారు.
కాగా అమెరికాలోని న్యూయార్క్ నగరంలో గల ఐక్యరాజ్యసమితిలో జరిగిన విలేకరుల సమావేశంలో శుక్రవారం పాకిస్తాన్ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాకిస్థాన్‌ను ‘ఉగ్రవాదానికి కేంద్రంగా’ అభివర్ణించడంపై స్పందిస్తూ కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా బిలావల్ భుట్టో మాట్లాడుతూ.. ‘ప్రపంచం దృష్టిలో తీవ్రవాదిగా ముద్రపడిన ఒసామా బిన్ లాడెన్ చనిపోయాడు, అయితే గుజరాత్ రాష్ట్రంలో ఒక వర్గం ఊచకోతకు కారకుడైన వ్యక్తి మాత్రం ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు. అతను భారతదేశానికి ప్రధాన మంత్రి కూడా అయ్యాడు, కానీ అతడిని పాకిస్తాన్ మాత్రం ‘బుచర్ ఆఫ్ గుజరాత్’గానే గుర్తిస్తుంది’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇక భుట్టో వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ (బిజెపి) మండిపడింది. ఆయనకు వ్యతిరేకంగా ఈ రోజు శనివారం దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. భుట్టో దిష్టిబొమ్మను దగ్ధం చేసి ఆయన ప్రకటనను పార్టీ కార్యకర్తలు ఖండించాలని బీజేపీ అధికారిక ప్రకటనలో పేర్కొంది. అలాగే పాకిస్తాన్‌లో పతనమవుతున్న ఆర్థిక వ్యవస్థ, చట్టవిరుద్ధ కార్యకలాపాలు మరియు తీవ్రవాదానికి ఆశ్రయం కల్పించడం వంటి చర్యల నుండి ప్రపంచ దృష్టిని మరల్చడానికే ఆయన ఈ వ్యాఖ్యలు చేశామని అభిప్తయపడింది. ఈ క్రమంలో బిలావల్ ప్రకటనకు వ్యతిరేకంగా శుక్రవారం రాత్రి ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ ఎదుట బీజేపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. భారత విదేశాంగ విధానం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్నదని, కానీ పాకిస్థాన్ మాత్రం వివిధ అంతర్జాతీయ వేదికలపై అవమానాలను ఎదుర్కొంటోందని వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ