- ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ఆదేశాలతోనే చేశామన్న అమెరికా రక్షణ విభాగం
ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై జనవరి 3, శుక్రవారం తెల్లవారుజామున రాకెట్ దాడి జరిగింది. ఈ దాడిలో ఇరాన్ సైనిక ఉన్నతాధికారి ఖాసీం సోలెమన్, ఇరాక్ తిరుగుబాటు సంస్థ పీఎంఎఫ్ డిప్యూటీ కమాండర్ అబు మహదీ అల్-ముహందిస్ సహా మరో ఐదుగురు ఇతర ఉన్నత స్థాయి కమాండర్లు మృతి చెందినట్టు తెలుస్తుంది. బాగ్దాద్ విమానాశ్రయ కార్గో హాల్‌ను మొత్తం మూడు రాకెట్లు ఢీకొట్టినట్లు ఇరాక్ భద్రతా వర్గాలు వెల్లడించాయి. అయితే బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై రాకెట్ దాడిని తామే జరిపినట్లు అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ ధ్రువీకరించింది. ఇరాన్ సైనిక ఉన్నతాధికారి ఖాసీం సోలెమన్‌ను చంపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఆదేశాల మేరకే ఈ దాడి జరిపినట్లు వెల్లడించింది. జనరల్ ఖాసీం సోలెమన్ మృతిని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ధ్రువీకరించారు.
ఇరాక్‌లో ఉన్న తమ బలగాల్ని రక్షించుకుకోవాలనే జనరల్ ఖాసీంను చంపాలని డోనాల్డ్ ట్రంప్ ఆదేశించినట్లుగా పెంటగాన్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకే అమెరికా యొక్క సైనిక వర్గాలు స్వీయ రక్షణలో భాగంగా దాడి చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇరాన్ చేయాలని భావిస్తున్న మరిన్ని దాడుల్ని నిరోధించాలనే ముందస్తుగా ఇలాంటి కీలక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. మరోవైపు ఇరాన్ ఖడ్స్ ఫోర్స్ విభాగాధిపతి జనరల్ ఖాసీం సోలెమన్‌ని చంపడాన్ని ఆ దేశం తీవ్రంగా ఖండించింది. ఈ దాడిపై ఇరాన్ విదేశాంగ మంత్రి జావద్ ఝరీఫ్ స్పందిస్తూ అమెరికా జరిపిన రాకెట్ దాడిని అతి భయంకరమైన, ఉద్రిక్తతలను పెంచే అవివేకపు చర్యగా అభివర్ణించారు. దీనివల్ల సంభవించబోయే అతితీవ్రమైన పరిణామాలకు అమెరికాయే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమనెయ్ స్పందిస్తూ, తీవ్ర ప్రతీకార దాడి తప్పదని హెచ్చరించారు. జనరల్ ఖాసీం సేవల్ని కొనియాడిన ఆయన మూడు రోజులు పాటుగా సంతాప దినాలను ప్రకటించారు.