నైతిక విలువలు పెంపొందించేలా విద్యావిధానం – సీఎం కేసీఆర్

Mango News Telugu, Political Updates 2020, telangana, Telangana Breaking News, Telangana CM KCR, Telangana Political Live Updates, Telangana Political Updates, Telangana Political Updates 2020, Telangana Schools, Telangana Schools Will Teach Moral and Ethical Values

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జనవరి 2, గురువారం నాడు ప్రగతిభవన్ లో మాజీ డిజిపి హెచ్.జె.దొర తన ఆటోబయోగ్రఫీగా రాసిన ‘జర్నీ థ్రూ టర్బులెంట్ టైమ్స్’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. మాజీ డీజీపీ దొర తన సర్వీసు కాలంలో ఎదుర్కొన్న క్లిష్టమైన సందర్భాలను వివరిస్తూ, ఇతర పోలీసు అధికారులకు స్పూర్తినిచ్చేలా ఈ పుస్తకం రాశారు. పుస్తక రచయితను, ప్రచురణ కర్తలను సీఎం కేసీఆర్ సన్మానించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ హెచ్.జె.దొరను మనసారా అభినందించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, సమాజంలో నేర ప్రవృత్తి పెరగకుండా నైతిక విలువలు పెంపొందించే విధంగా విద్యావిధానం ఉండాలని అభిలషించారు. మంచి సమాజం నిర్మించే క్రమంలో ధార్మికవేత్తలు, మాజీ డీజీపీల సలహాలతో పాఠ్యాంశాలను రూపొందిస్తామని, వచ్చే విద్యా సంవత్సరం నుంచే విద్యాసంస్థల్లో నైతిక విలువలు పెంపొందించే బోధనలు ప్రారంభిస్తామని సీఎం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు మాజీ గవర్నర్ పిఎస్ రామ్మోహన్ రావు, కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభన్, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, విజిలెన్స్ కమిషనర్ కె.ఆర్. నందన్, డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, పలువురు మాజీ డీజీపీలు, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు, దొర గురువు ఆచార్య ఆర్వీఆర్ చంద్రశేఖర్ రావు, ప్రముఖ పాత్రికేయులు ఐ.వెంకట్రావు, పలువురు ఐపీఎస్, ఐఎఎస్ అధికారులు, దొర స్నేహితులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

విద్యా సంస్థల్లో విలువలు పెంపొందించే పాఠ్యాంశాల బోధన

‘‘దురదృష్టవశాత్తూ సమాజంలో నేరప్రవృత్తి పెరుగుతున్నది. కొన్ని చోట్ల మనుషులు మృగాల్లా మారుతున్నారు. నేర ప్రవృత్తి ప్రబలకుండా చూడాల్సిన అవసరం ఉంది. విద్యాసంస్థల్లో పిల్లలకు మంచి విద్యాబోధన చేయడం ద్వారానే నైతిక విలువలు పెంపొందించవచ్చు. దీనికోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచే విద్యా సంస్థల్లో విలువలు పెంపొందించే పాఠ్యాంశాలను బోధించాలని భావిస్తున్నాం. ఇందుకోసం అవసరమైన పాఠ్యాంశాలను తయారు చేయాలి. మాజీ డీజీపీలతో కమిటీ వేస్తాం. ఆధ్మాత్మిక, ధార్మికవేత్తల సలహాలు తీసుకుంటాం. మంచి సమాజం నిర్మించేందుకు అవసరమైన బోధనలను వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రారంభిస్తాం. తెలంగాణను ఆదర్శవంతమైన సమాజంగా తీర్చిదిద్దడానికి పోలీసులు కూడా తమ విలువైన భాగస్వామ్యం అందించాలి’’ అని సీఎం కేసీఆర్ కోరారు.

ప్రజల మనోభావాలను గుర్తించాలి

‘‘మంచిని కాపాడడం కోసం కఠినంగా వ్యవహరించడం తప్పుకాదు. కర్తవ్య నిర్వహణలో అది అవసరం కూడా. ప్రజాస్వామ్యంలో కొన్ని పనులు ఇష్టం లేకున్నా చేయాల్సి వస్తుంది. ప్రజల మనోభావాలను గుర్తించి, గౌరవించి కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. అది తప్పు కాదు. సమాజానికి మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు కొన్ని పనులు కఠినంగా చేయక తప్పదని సీఎం అన్నారు. డీజీపీ మహేందర్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ పోలీసులు సామాజిక రుగ్మతలు తొలగించే విషయంలో ఎంతో కృషి చేస్తున్నారు. కేవలం శాంతి భద్రతల పర్యవేక్షణకే పరిమతం కాకుండా సామాజిక బాధ్యతతో అనేక కర్తవ్యాలు నిర్వర్తిస్తున్నారు. గుడుంబా నిర్మూలనలో, పేకాట క్లబ్బుల మూసివేతలో, బియ్యం అక్రమ రవాణాను అరికట్టడంలో, హరితహారం ద్వారా చెట్లు పెంచడంలో ఎంతో కృషి చేశారు. ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సంపూర్ణ అక్షరాస్యత సాధించే రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కూడా పోలీసులు తమవంతు పాత్ర పోషించాలి. ఈ సంవత్సరమే సంపూర్ణ అక్షరాస్యత సాధించే ప్రయత్నాన్ని ప్రభుత్వం చిత్తశుద్ధితో చేపడుతుంది. అందులో పోలీసులు భాగస్వాములై విజయవంతం చేయాలి. చదువుకోని వారందరినీ అక్షరాస్యులగా మార్చే ప్రతిజ్ఞ తీసుకోవాలి’’ అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.

‘‘హెచ్.జె. దొర తన అనుభవాన్నంతా రంగరించి మంచి పుస్తకం రాశారు. టీమ్ వర్కుతో ఎలా విజయాలు సాధించవచ్చో, క్లిష్టమైన సమయాల్లో వ్యూహాత్మంగా వ్యవహరించాలో, నేరాలను అదుపు చేయడంలో ఎలాంటి పద్ధతులు అవలంభిచాలో, ఉన్న వనరులతో ఎంత సమర్థవంతంగా పనిచేయవచ్చో దొర అనుభవం ద్వారా నేర్పారు. పుస్తకంలో కూడా అనేక విషయాలు చెప్పారు. వాటన్నింటినీ స్పూర్తిగా తీసుకుని పోలీసు అధికారులు ముందుకుపోవాలి. మానవ జీవితంలో మార్పులు అనివార్యం. ఎప్పటికప్పుడు వచ్చే మార్పులకు అనుగుణంగా మనం కూడా మారుతూ కార్యాలు నెరవేర్చాలి. సిబ్బందికి ఎప్పటికప్పుడు శిక్షణ ఇచ్చి నిష్ణాతులను చేయాలి. వారిలో ప్రొఫెషనలిజం పెరగాలి. దీనికి అవసరమైన చర్యలు డిజిపి తీసుకోవాలని చెప్పారు. దేశంలో మనం ఏ ఊరికి వెళ్లి వెతికినా దళితులే పేదలుగా కనిపిస్తున్నారు. ఈ పరిస్థితి పోవాలి. దళితులు ఎదగాలి. తెలంగాణ రాష్ట్రంలో దళితులను విద్యావంతులను చేయడానికి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఎంతో కష్టపడుతున్నారు. దళితులను ఉన్నత స్థాయికి తీసుకుపోవాలనే ప్రవీణ్ సంకల్పానికి మేము సంపూర్ణ మద్దతు ఇస్తున్నాను. దళితుల్లో న్యూనతాభావాన్ని తీసేసి, తాము గొప్ప పాఠశాలల్లో చదువుతున్నామనే భావన కల్పిస్తున్నారు. ఇలాంటి వాళ్లను ప్రోత్సహించాలని అన్నారు. మనమెవరమూ వెయ్యేళ్లు బతకడానికి రాలేదు. జీవించిన కాలంలో ఎంత గొప్పగా బతికాం, ఎంత ఆదర్శవంతంగా నిలబడినాం అనేది ముఖ్యం. దొర అలాంటి వారిలో ఒకరు. గ్రే హౌండ్స్ ను తీర్చిదిద్ది ఇప్పటికీ అందులో శిక్షణ ఇస్తున్న భాటి లాంటి వారు ఆదర్శప్రాయులని సీఎం కేసీఆర్ అన్నారు.

తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా మారుతుంది- హెచ్.జె.దొర

పుస్తక రచయిత హెచ్.జె.దొర మాట్లాడుతూ, పోలీసులు ఎప్పుడూ తాము హెల్ప్ లెస్ అనే భావనకు గురికావద్దని, ఉన్న వనరులను సమర్థవంతంగా వాడుకోవాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో ప్రజోపయోగ పనులు జరుగుతున్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, రెసిడెన్షియల్ స్కూళ్లు, ప్రజావైద్యం మెరుగుదల, చెరువుల పునరుద్ధరణ పనులు తెలంగాణ రాష్ట్రానికి గొప్ప సంపదగా మిగులుతాయన్నారు. భవిష్యత్తులో చాలా మంది మేటి విద్యార్ధులు తెలంగాణ రెసిడెన్షియల్ స్కూళ్ల నుంచి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మానవ వనరులను సమర్థవంతంగా వినియోగించడం ద్వారా తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా మారుతుందనే నమ్మకం తనకుందని దొర అన్నారు. సర్వీసు కాలంలో తాను ఎదుర్కొన్న సవాళ్లను ఎలా అధిగమించిందీ, పోలీసులు ఎంత వ్యూహాత్మకంగా వ్యవహరించాలి అనే విషయాలను దొర వివరించారు. డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, పూర్వ అధికారుల నుంచి ఎంతో నేర్చుకోవడం ద్వారా ఇప్పుడు పనిచేస్తున్న పోలీసు అధికారులు పెను మార్పులు తీసుకురావడం సాధ్యమవుతుందన్నారు. ఈ దిశలో ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. తెలంగాణ పోలీసు శాఖకు సీఎం కేసీఆర్ మార్గదర్శకుడిగా నిలవడం ద్వారానే ఎన్నో మంచి ఫలితాలు సాధించగలిగామన్నారు.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × two =