మధ్యప్రదేశ్ రాష్ట్రంలో క్షణ క్షణానికి రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి. జ్యోతిరాదిత్య సింధియా వర్గానికి చెందిన 20 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తూ బెంగళూరు చేరుకోవడంతో మధ్యప్రదేశ్ లో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో మార్చ్ 10, మంగళవారం ఉదయం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత, కేంద్ర మాజీ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. మధ్యప్రదేశ్‌లో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లుగా తెలుస్తుంది. సింధియా రాజీనామా అనంతరం బెంగళూరులో ఉన్న 20 మంది ఎమ్మెల్యేలు కూడా తమ రాజీనామా పత్రాలను ఈమెయిల్ ద్వారా గవర్నర్‌కు పంపినట్లు రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. రాజీనామా చేసిన వారిలో ఆరుగురు రాష్ట్ర మంత్రులు కూడా ఉన్నారు.
మరోవైపు సింధియా తన రాజీనామా నిర్ణయాన్ని వెల్లడించిన కొద్దిసేపటికే ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండడం వలనే సింధియాను కాంగ్రెస్ పార్టీ నుంచి తక్షణమే బహిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. సింధియా బహిష్కరణకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూడా ఆమోదం తెలిపినట్లు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. సింధియాను పార్టీ ఎంతగానో గౌరవించిందని, అతను ఇప్పుడు స్వార్థపరుడిగా మారారని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌధురీ విమర్శించారు.