ప్రధాని నరేంద్ర మోదీపై టీఆర్‌ఎస్ ఎంపీలు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లు ఆమోదంపై రాష్ట్రపతి ప్రసంగం సందర్భంగా మంగళవారం రాజ్యసభలో ప్రధాని మోదీ చేసిన ప్రకటన ఒక్కసారిగా తెలంగాణాలో వేడి రగిలించింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లును ఆమోదించే సమయంలో సభ నిర్వహణ అనుసరించిన విధానాలను ప్రధాని మోదీ బహిరంగంగా ప్రశ్నించారు. దీనిపై అధికార టీఆర్‌ఎస్ సహా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కూడా మండిపడుతోంది. తెలంగాణ ప్రజలను ప్రధాని అవమానించారని అధికార టీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది.
ఈక్రమంలో ప్రధాని మోదీపై సభా హక్కుల ఉల్లంఘన కింద రాజ్యసభ సెక్రెటరీ జనరల్‌కు నోటీసులు అందజేశారు. 187వ నిబంధన కింద టీఆర్‌ఎస్ ఎంపీలు కే కేశవరావు, సంతోష్, లింగయ్య యాదవ్, సురేశ్ రెడ్డి నోటీసు ఇచ్చారు. టీఆర్‌ఎస్ ఎంపిల అభిప్రాయం ప్రకారం.. ” ప్రధాని చేసిన ఈ ప్రకటన పార్లమెంటు ఉభయ సభల స్థాయిని అత్యంత అవమానకరంగా చూపించడంలో దోహదపడింది. సభ యొక్క విధి, విధానాలు మరియు కార్యకలాపాలను ప్రశ్నించేదానికి దారితీస్తుంది. ఇంకా, పార్లమెంటు పనితీరును కించపరచడం తీవ్రమైన నేరం. ఇది పార్లమెంటు సభ్యులు మరియు ప్రిసైడింగ్ అధికారులను అవమానించడం వంటిది” అని టిఆర్‌ఎస్ ఎంపీలు తెలిపారు.
“ఆనాడు నెలకొన్న గందరగోళ పరిస్థితుల్లో కొంతమంది సభ్యుల అనుచిత ప్రవర్తన సభలో వ్యాప్తి చెందకుండా ఉండేందుకు సభ తలుపులు మూసేయాలన్న ప్రిసైడింగ్ అధికారి నిర్ణయం కూడా ప్రధాని వ్యాఖ్యలతో ప్రశ్నార్థకమైంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లు ఆమోదం పొందుతున్న సమయంలో ప్రిసైడింగ్ అధికారులు మరియు సభ నిర్వహణ అనుసరించిన విధానాలను ప్రధాన మంత్రి బహిరంగంగా ప్రశ్నించారు. సభకు ఉన్న విస్తృత అధికారాలను ప్రశ్నించడం సభను ధిక్కరించడమే. ఈ సందర్భంలో ప్రిసైడింగ్ అధికారి ప్రవర్తనను తప్పు పట్టేందుకు ప్రధాని ప్రయత్నించి వారిని దూషించారు” అని టిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవరావు, ఇతర ఆర్‌ఎస్ సభ్యులు గురువారం రాజ్యసభ ఛైర్మన్‌కు సమర్పించిన నోటీసులో పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ