ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు (జూన్ 3, శుక్రవారం) ఉత్తర్ ప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా లక్నోలో జరిగిన యూపీ పెట్టుబడిదారుల సదస్సు 3.0 శంకుస్థాపన వేడుకలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రూ.80,000 కోట్లకు పైగా విలువైన 1406 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఇందులో వ్యవసాయం మరియు అనుబంధిత, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్, ఎంఎస్ఎంఈ, మాన్యుఫాక్చరింగ్, రెన్యువబుల్ ఎనర్జీ, ఫార్మా, పర్యాటకం, రక్షణ, ఏరోస్పేస్, చేనేత, టెక్స్టైల్స్ మొదలైన విభిన్న రంగాల ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా దేశంలోని పలు అగ్ర పరిశ్రమలకు చెందిన పారిశ్రామికవేత్తలు, ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఉత్తర్ ప్రదేశ్ యువతలోని సమర్థత, అంకిత భావం, కృషి, అవగాహనపై విశ్వాసం చూపినందుకు పెట్టుబడిదారులకు కృతజ్ఞతలు తెలిపారు. పారిశ్రామికవేత్తలు కాశీని కూడా సందర్శించాలని కోరారు. ఈరోజు సదస్సులో ప్రవేశపెట్టిన ప్రతిపాదనలు ఉత్తర్ ప్రదేశ్లో కొత్త అవకాశాలను సృష్టిస్తాయని మరియు ఉత్తర్ ప్రదేశ్ అభివృద్ధిలో పెరుగుతున్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తాయని ప్రధాని అన్నారు. అలాగే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని ప్రధాని ప్రస్తావిస్తూ, “సంస్కరణలు-పనిచేయడం-పరివర్తన అనే మంత్రంతో సంవత్సరాలగా ముందుకు సాగామని అన్నారు. విధాన స్థిరత్వానికి, సమన్వయానికి ప్రాధాన్యతనిచ్చి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్పై దృష్టి పెట్టామని చెప్పారు. ఒక దేశం-ఒక పన్ను (జీఎస్టీ), ఒక దేశం-ఒక గ్రిడ్, ఒక దేశం-ఒక మొబిలిటీ కార్డ్, ఒక దేశం-ఒక రేషన్ కార్డ్ వంటి ప్రయత్నాలు ప్రభుత్వ దృఢమైన మరియు స్పష్టమైన విధానాలకు ప్రతిబింబమని పేర్కొన్నారు.
2017 తర్వాత ఉత్తర్ ప్రదేశ్లో సాధించిన పురోగతి గురించి ప్రధాని మాట్లాడుతూ, వేగవంతమైన వృద్ధి కోసం, మా డబుల్ ఇంజన్ ప్రభుత్వం మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు మరియు మాన్యుఫాక్చరింగ్ పై కలిసి పనిచేస్తోందని అన్నారు. ఈ ఏడాది బడ్జెట్లో మునుపెన్నడూ లేని విధంగా రూ.7.50 లక్షల కోట్ల మూలధన వ్యయం కేటాయించడం ఈ దిశలో ఒక ముందడుగు అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి మెరుగుపడి, వ్యాపార వర్గాల విశ్వాసాన్ని పునరుద్ధరించబడిందన్నారు. పరిశ్రమలకు సరైన వాతావరణం ఏర్పడిందని, రాష్ట్రంలో పరిపాలనా వ్యవస్థలు మెరుగుపడ్డాయని తెలిపారు. ఉత్తర్ ప్రదేశ్లో 25-30 జిల్లాలను కవర్ చేస్తూ, 1100 కి.మీల పొడవునా గంగా నది విస్తరించి ఉందని, ఇది సహజ వ్యవసాయానికి అపారమైన అవకాశాలను సృష్టిస్తుందన్నారు. వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు కార్పొరేట్ ప్రపంచానికి ఇప్పుడు సువర్ణావకాశమని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF