తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు గత 36 రోజులుగా ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ సమ్మెను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ సమ్మెను మరింతగా ఉధృతం చేసే దిశగా తెలంగాణ ఆర్టీసీ జేఏసీ, విపక్ష పార్టీలతో కలిసి నవంబర్ 9, శనివారం నాడు సకల జనుల సామూహిక దీక్ష కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమాన్ని గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో నిర్వహించిన మిలియన్ మార్చ్ తరహాలో ట్యాంక్ బండ్ పై నిర్వహించాలని ఆర్టీసీ జేఏసీ, విపక్ష పార్టీలతో కలిసి ఏర్పాట్లు చేసింది. అయితే చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమానికి పోలీసులు అనుమతిని నిరాకరించారు. ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం పోలీసులను భారీగా మోహరించింది. ట్యాంక్‌బండ్‌పైకి వచ్చేందుకు వీలున్న అన్ని మార్గాలను పోలీసులు నియంత్రణలోకి తీసుకున్నారు. పలు చోట్ల చెక్‌పోస్టు ఏర్పాట్లు చేసి ఎవరూ ట్యాంక్ బండ్ పైకి చేరుకోకుండా పరిస్థితులను పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.
చలో ట్యాంక్ బండ్ నేపథ్యంలో ఇప్పటి వరకు మొత్తం 170 మందిని అరెస్ట్ చేశామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. నగరంలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. ఆర్టీసీ జేఏసీ నాయకులతో పాటు, రాజకీయ పార్టీలకు చెందిన కొంతమంది నేతలను శుక్రవారమే అరెస్టు చేశామని ఆయన పేర్కొన్నారు. ట్యాంక్ బండ్ పై వెళ్ళటానికి ప్రయత్నించిన ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్ధామరెడ్డిని లిబర్టీ సెంటర్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. కో కన్వీనర్ రాజిరెడ్డిని పోలీసులు ఈ రోజు ఉదయమే అరెస్టు చేసి వేరే ప్రాంతానికి తరలించారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆర్టీసీ కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అంబర్‌పేట్‌లో మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్యను ఈ రోజు ఉదయం అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ నాయకులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, డీకే అరుణ, పొంగులేటి సుధాకర్ రెడ్డి, తెదేపా నాయకుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డిని పోలీసులు, ఈ రోజు ఉదయం నుంచే గృహనిర్బంధం చేశారు. మరో వైపు అయోధ్యలో రామమందిరం- బాబ్రీమసీదు కేసుపై సుప్రీంకోర్టు తీర్పు ప్రకటించిన నేపథ్యంలోహైదరాబాద్ లో పటిష్ఠమైన బందోబస్తును ఏర్పాటు చేశామని సీపీ అంజనీకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా సభలు, సమావేశాలు, నిరసనలకు ఎటువంటి అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు.
Subscribe to our Youtube Channel Mango News for the latest News.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


