తెలంగాణ రాష్ట్రంలో వరి పంట సాగు, ధాన్యం దిగుబడులు, బియ్యం తయారీ, అమ్మకం, ఎగుమతుల విషయమై అవలంబించాల్సిన విధానం మరియు సంబంధిత ఇతర అంశాలపై మార్చ్ 30 , సోమవారం నాడు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి ఎస్. నిరంజన్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి బి. జనార్థన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ” తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 2200 రైస్ మిల్లులున్నాయి. ఈ మిల్లులు ఏడాదికి కోటి టన్నుల బియ్యం తయారు చేయగలవు. గతంలో వీటికి సరిపడా ధాన్యం కూడా రాకపోయేది. కరెంటు కూడా ఉందని పరిస్థితులు ఉన్నాయి. ఫలితంగా 20-30 లక్షల టన్నుల బియ్యం తయారు చేయడం కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ధాన్యం పుష్కలంగా ఉంది. 24 గంటల నిరంతరాయ కరెంటు ఉంది. దీన్ని మంచి అవకాశంగా మార్చుకుని రైసు మిల్లులు ఎక్కువ మొత్తంలో వడ్లు పట్టాల్సి ఉంది. రాష్ట్ర ప్రజల అవసరాలు తీరడమే కాకుండా, ఎఫ్.సి.ఐ.కి పంపించడానికి, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయడానికి అనువుగా మిల్లులన్నీ పూర్తి సామర్థ్యంతో పని చేయాలి. ఇంకా మరికొన్ని మిల్లులు రావాలి. రైసుమిల్లులు బాగా నడవడానికి, అవి లాభాల్లో ఉండడానికి ప్రభుత్వ పరంగా చేయాల్సిన సాయం చేస్తాం. తెలంగాణలోని రైసు మిల్లులు రాష్ట్ర ప్రగతిలో బాగస్వామ్యం కావాలని” పిలుపునిచ్చారు.
ఈ అంశంపై సీఎం కేసీఆర్ చెప్పిన మరికొన్ని విషయాలు:
- రైసు మిల్లర్లకు ఇకపై అధికారుల నుంచి వేధింపులుండవు. అనేక రకాల అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేకుండా విధానంలో ప్రభుత్వం మార్పులు తెస్తుంది.
- రైస్ మిల్లర్లకు సరైన మార్కెటింగ్ వ్యూహం ఉండాలి. తెలంగాణ ప్రజలు ఏ రకం బియ్యం తింటారు? ఇతర రాష్ట్రాల వారు ఏ రకం బియ్యం తింటారు? అనే విషయాలను సరిగ్గా అంచనా వేసి, దానికి అనుగుణంగా ధాన్యం రకాలను పండించాలి. వాటిని ఎప్పటికప్పుడు బియ్యంగా మార్చి ఇటు రాష్ట్ర ప్రజలకు, అటు ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు పంపించాలి.
- ప్రస్తుతం కరోనా ప్రభావంతో రైసు మిల్లుల్లో పనిచేసే హమాలీలో తమ సొంత రాష్ట్రమైన బీహార్ వెళ్ళారు. మళ్లీ సీజన్ వచ్చింది కాబట్టి, ప్రత్యేక బస్సుల్లో వారిని తిరిగి రప్పించేందుకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తుంది.
- రాష్ట్రంలో రైసు మిల్లుల స్థాపనకు పారిశ్రామిక వాడల్లో స్థలం కేటాయించే అవకాశాలను పరిశీలిస్తాం. రైసు మిల్లులను ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ గా గుర్తించి, అసరమైన రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తాం.
- రాష్ట్రంలో గోదాముల సంఖ్యను పెంచాలి. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడక ముందు కేవలం 4 లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములే ఉండేవి. వాటిని 22 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యానికి గోదాముల సంఖ్యను పెంచాము. దీన్ని 40 లక్షలకు తీసుకుపోవాలి.
- రైసు మిల్లుల్లో గోదాములు నిర్మించుకోవడానికి ప్రభుత్వ పరంగా తగిన సహకారం అందించాలి.
- రాష్ట్రంలో రైసు మిల్లులు ఎక్కువున్న ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో రైల్వే సైడింగ్స్ ఏర్పాటు చేయాలి.
- రైసు మిల్లుల ఎల్.టి. కేటగిరిని 70 హెచ్.పి.ల సామర్థ్యం నుంచి 150 హెచ్.పి.ల సామర్థ్యానికి పెంచే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తుంది.
[subscribe]