అధికారుల పనితీరు పరిశీలనకు జూన్ 19 తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు: సీఎం కేసీఆర్

CM KCR, CM KCR held High-level Review Meeting on Palle and Pattana Pragathi Programmes, CM KCR High level Review meeting, CM KCR High-level Review Meeting on Palle and Pattana Pragathi Programmes, CM KCR On Palle Pragathi Program, KCR Meeting Over Palle Pragathi, Mango News, Palle and Pattana Pragathi Programmes, Palle Pragathi Programme, Pattana Pragathi Guidelines, Pattana Pragathi Programme, Telangana Palle Pragathi, Telangana Pattana Pragathi Programme

రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాల్లో జరుగుతున్న ప్రగతి తీరును, పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖ అధికారుల పనితీరును పరిశీలించేందుకు జూన్ 19 తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలను తానే స్వయంగా చేపడుతానని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఇందులో భాగంగా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల క్షేత్రస్థాయి పనితీరును సమీక్షించడానికి జూన్ 13న అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారుల(డీపీఓ) లతో ప్రగతి భవన్ లో సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నామని సీఎం తెలిపారు.

అలాగే సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు ముందస్తు చర్యలను సిద్ధం చేసుకునే చార్టును రూపొందించుకోవాలని, దానికి అనుగుణంగా ప్రతీ సీజన్లో ముందస్తు కార్యాచరణను చేపట్టే సంస్కృతిని ఆయా శాఖల ప్రభుత్వ యంత్రాంగం అభివృద్ధి చేసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టిందని, రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 1.47 శాతానికి పడిపోయిందని సీఎం తెలిపారు. కరోనా పూర్తిగా తగ్గిన తర్వాత, త్వరలో మరో విడత పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను చేపడుతామని సీఎం తెలిపారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచడానికి అటవీ శాఖ ప్రత్యేక కార్యాచరణను కొనసాగించాలని సీఎం ఆదేశించారు. శుక్రవారం నాడు ప్రగతి భవన్ లో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి తీరు, అందుకనుగుణంగా అదనపు కలెక్టర్లు, డీపీఓలు సహా మున్సిపల్, పంచాయతీ రాజ్ సిబ్బంది పనితీరు, చేపట్టవలసిన చర్యలపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

ప్రతినెలా గ్రామాలకోసం రూ.339 కోట్లు, మున్సిపాలిటీల అభివృద్ధి కోసం రూ.148 కోట్ల విడుదల:

నూతన పంచాయతీ రాజ్, మున్సిపాలిటీ చట్టాలను అమల్లోకి తెచ్చి పల్లెలు, పట్టణాల అభివృద్దికి దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వం సహకారం అందిస్తున్నదని సీఎం అన్నారు. గ్రామాలకు, మున్సిపాలిటీలకు ఆర్థికంగా అండదండలందిస్తూ ఉద్యోగుల భర్తీ చేపట్టి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తున్నదన్నారు. ప్రతినెలా గ్రామాల అభివృద్ధి కోసం రూ.339 కోట్లు, మున్సిపాలిటీల అభివృద్ధి కోసం 148 కోట్ల రూపాయలను క్రమం తప్పకుండా విడుదల చేస్తున్నదన్నారు. పంచాయతీ రాజ్ వ్యవస్థలో కింది నుంచిపై స్థాయి వరకు సిబ్బందిని ప్రభుత్వం పూర్తి స్థాయిలో నియమించిందని సీఎం గుర్తు చేసారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు సత్పలితాలనిస్తున్నాయని, ఇంకా చేరుకోవాల్సిన లక్ష్యాలు మిగిలే వున్నాయని సీఎం తెలిపారు. నిర్దేశిత బాధ్యతలను నిర్వర్తించడంలో పంచాయతీ రాజ్ ఉద్యోగులు, అధికారులు ఎందుకు వైఫల్యం చెందుతున్నారో తెలుసుకోవాల్సివున్నదని అన్నారు. తాత్సారం జరిగినట్టు నిర్లక్ష్యంతో వ్యవహరించినట్టు తన పర్యటనలో గుర్తిస్తే ఎవరినీ క్షమించబోనని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

గ్రామాలు, మున్సిపాలిటీల్లో పనుల పురోగతి, వెనుకబాటుపై చార్టు సిద్ధం చేయాలి:

ఇప్పటివరకు గ్రామాలు, మున్సిపాలిటీలల్లో ఎంత వరకు ఏమేమి పనులు జరిగాయో ఒక చార్టును రూపొందించాలని సీఎస్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. పల్లె ప్రగతి చార్టును, పట్టణ ప్రగతి చార్టును వేరు వేరుగా రూపొందించాలన్నారు. గ్రామాలు, పట్టణాల్లో జరుగుతున్న ప్రగతిలో భాగంగా పారిశుధ్యం, పచ్చదనం, మంచినీటి సరఫరా, రోజువారీ పరిశుభ్రత, మొక్కల స్థితి, మొక్కలు బతికిన శాతం, గ్రామసభలు నిర్వహించిన తీరు, స్థానిక ఎంపీఓలు పాల్గొన్నతీరు, అందులో వారు గ్రామ ప్రగతి కోసం తీసుకున్న చర్యలు, ఎన్నిసార్లు గ్రామ సభలు నిర్వహించారు, గ్రామ ప్రగతి నివేదికల మీద జరిగిన చర్చల సారాంశం వంటి అంశాలను చార్టులో పొందుపరచాలన్నారు. వాటితో పాటు చెత్తసేకరణ, డంపుయార్డులు, వైకుంఠధామాల నిర్మాణ స్థితి, బోరుబావులు పూడ్చడం, ప్రభుత్వ కార్యాలయాలలో పారిశుధ్య నిర్వహణ, ట్రాక్టర్ల కిస్తులు కడుతున్నతీరు, కరెంటు బిల్లుల వసూలు, గ్రామ పంచాయితీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం, డ్రైనేజీలు, నాలాలు క్లీనింగ్, వెజ్ నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణం, వంటి అంశాలను చేర్చాలన్నారు. వాటితో పాటు ఉత్తమ గ్రామాలను, మండలాలను, అధ్వానంగా ఉన్న గ్రామాలు మండలాలను గుర్తించడం వాటికి గల కారణాలను ఈ చార్టులో ప్రత్యేకంగా పేర్కొనాలని సీఎం ఆదేశించారు. అన్ని రకాల అంశాలను పొందుపరిచి వాటిల్లో జరుగుతున్న పురోగతినే కాకుండా వెనుకబాటును కూడా చార్టు రూపంలో సిద్ధం చేయాలని, మంచి చెడులను రెండింటిని ప్రాతిపదికగా తీసుకుని చార్టును తయారు చేసి, ఆకస్మిక తనిఖీ పర్యటనలో తనకు అందచేయాలని సీఎస్ ను ఆదేశించారు.

సీజనల్ వ్యాధులు అరికట్టేందుకు గ్రామాల్లో సీజన్ వారీగా చార్ట్ తయారు చేయాలి:

సీజనల్ వ్యాధులను ముందస్తుగానే అరికట్టేందుకు గ్రామాల్లో ఇకనుంచి సీజన్ వారీగా చార్ట్ తయారు చేయాలని సీఎం అధికారులకు సూచించారు. వానాకాలం సహా శీతాకాలం, ఎండాకాలం మూడు కాలాల్లో వ్యాప్తిచెందే వ్యాధులను గుర్తించి వాటి నివారణకు చేపట్టాల్సిన చర్యలను చార్టు రూపంలో రూపొందించుకోవాలన్నారు. ప్రతి సంవత్సరమూ సీజన్ రాకముందే సంబంధిత వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ‘‘గ్రామాలను, పట్టణాలను పరిశుభ్రంగా పచ్చదనంతో నిర్వహించుకోవడం కన్నామించిన పని ప్రభుత్వానికి లేదు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు విజయవంత మయ్యాయి. అందులో సందేహం లేదు. అయితే పల్లెలు, పట్టణాలల్లో పారిశుధ్యం పచ్చదనాన్ని పెంచే కార్యక్రమాలను నిత్యం కొనసాగించాలె. అది నిరంతర ప్రక్రియ. ఈ క్రమంలో పంచాయతీరాజ్ సహా సంబంధిత శాఖల ఉద్యోగులు ఏమాత్రం అలసత్వానికి తావివ్వకూడదు. మీకు పూర్తి సమయమివ్వాలనే నేను ఇన్ని రోజులు పర్యటన చేపట్టలేదు. రెండేండ్లు గడిచిపోయినయి. ఇక నేను రంగంలోకి దిగక తప్పదు. అలసత్వం వహించిన ఏ స్థాయి అధికారినైనా ఉపేక్షించేది లేదు. క్షమించేదీలేదు. కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని సీఎం స్పష్టం చేశారు.

‘‘అదనపు కలెక్టర్లను నియమించుకోవడంలో ప్రధాన ఉద్దేశ్యం పల్లెలు, పట్టణాలను బాగు చేసుకోవాడానికే. వారు నిరంతరం క్షేత్రస్థాయిలో నిమగ్నమైవుండాలి. డీపీఓలు సహా కింది స్థాయి ఉద్యోగులను ఆ దిశగా ఉత్సాహపరుస్తూ అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి. కానీ అదనపు కలెక్టర్లు అనుకున్న రీతిలో తమ పని సామర్థ్యాన్ని నిరూపించుకోవడం లేదు. వారి నుంచి నేను చానా ఆశించినా, కానీ అనుకున్నంత స్థాయికి వారి పనితీరు చేరుకుంటలేదు. కేవలం పంచాయతీ రాజ్ శాఖ మంత్రి, మున్సిపల్ మంత్రులు మాత్రమే అన్నీ చేయాలంటే కాదు. ఏ జిల్లాలో ఆ జిల్లా మంత్రి, స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అన్ని స్థాయిల్లోని ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో మరింతగా భాగస్వాములు కావాలె. ప్రజలను చైతన్యపరిచి వారిని మరింతగా భాగస్వాములను చేయాలె’’ అని సీఎం వివరించారు. ఈ నేపథ్యంలో జూన్ 13 న ప్రగతి భవన్ లో అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కోసం చేపడుతున్న కార్యాచరణ, వారి పనితీరుపై సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నామని సీఎం తెలిపారు.

‘‘ప్రతి సీజన్లో కొన్ని ప్రత్యేక వ్యాధులు ప్రబలుతుండడం సహజం. వానాకాలం వస్తే మలేరియా డెంగ్యూ వంటి జ్వరాలు, చలికాలంలో స్వైన్ ఫ్లూ వంటి వ్యాధులు, ఎండాకాలంలో డయేరియా వంటి వ్యాధులు వస్తుంటయి. కరోనా వంటి వ్యాధుల నేపథ్యంలో సీజనల్ వ్యాధులను ముందస్తుగానే గుర్తించి అరికట్టడం అతి ముఖ్యం. ఇందుకు గాను.. పంచాయితీరాజ్ శాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ, హెల్త్ డిపార్ట్ మెంట్ మూడు శాఖలు సమన్వయంతో పనిచేయాలి’’ అని సీఎం సంబంధిత మంత్రులకు, అధికారులకు సూచించారు. వానాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ట్యాంకులను శుద్ధి చేసి తాగునీరును అందిచాలన్నారు. కరోనా నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఎఎన్ఎం, ఆశా వర్కర్లు సహా వైద్యారోగ్యశాఖ ఉద్యోగులను సమాయత్తపరచాలని వారిని ముందస్తుగానే ప్రతీ సీజన్ లో సీజనల్ వ్యాధులను నివారించే చర్యలకు సిద్ధం చేయాలన్నారు. అభివృద్ది కండ్లకు కనిపించినప్పుడే ప్రజలు ప్రజాప్రతినిధులు వెంట నడుస్తారని ఆ దిశగా ఇప్పటికే విజయం సాధించిన పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాలు దేశంలోనే ఉత్తమమైనవిగా గుర్తించబడినాయని, ఈనేపథ్యంలో అలసత్వం వదిలి మరింత పట్టుదలతో పనిచేసి తెలంగాణను అద్దంలా తీర్చిదిద్దుకోవాలని సీఎం అధికారులకు స్పష్టం చేశారు.

‘‘ఇకనుంచి మున్సిపల్ డైరెక్టరు, పంచాయతీరాజ్ కమిషనర్లు జిల్లాలు, గ్రామాల పర్యటన చేపట్టాలని, వారు క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పల్లెలు, పట్టణాల ప్రగతి తీరును పరిశీలించాలన్నారు. డీపీఓలను కూడా పల్లెల పర్యటనల్లో నిమగ్నం చేయాలని సీఎం స్పష్టం చేశారు. గ్రామాలు, మున్సిపాలిటీల పరిధిలో అక్రమ లే అవుట్లు యధావిధిగా కొనసాగుతున్నట్టు తనకు సమాచారం వుందని వాటి గురించి చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్లు మున్సిపాలిటీల బడ్జెట్ తయారీలో భాగస్వాములు కావాలని చెప్పామని ఏ మేరకు అవుతున్నారని సీఎం ఆరాతీసారు. తెలంగాణ ముఖచిత్రానికి జాతీయ రహదారులు అద్దం పడుతాయని వాటివెంట పచ్చని చెట్లను నాటి పెంచాలని సీఎం తెలిపారు. మొక్కలు పెంచి సంరక్షించే బాధ్యత సంబందిత కాంట్రాక్టర్లదే కాబట్టి వారితో మొక్కలు నాటించే కార్యక్రమాన్ని పట్టుబట్టి చేయించాలన్నారు. రాష్ట్రంలో అడవుల పునరుజ్జీవనం మీద ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

కరోనా తగ్గుముఖం పట్టిందని, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఒక్క శాతానికి పాజిటివీ రేటు చేరకున్నదని అధికారులు సీఎంకు వివరించారు. కాగా కరోనా రోగులను పరామర్శించేందుకు సీఎం ఇటీవల చేపట్టిన గాంధీ, ఎంజీఎం దవాఖానాల పర్యటన, రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితులకే కాకుండా, చికిత్స చేసే వైద్యుల్లో కూడా ఎంతో భరోసాను, ధైర్యాన్ని నింపిందని సమావేశం అభిప్రాయపడింది. ఐసీయూల్లో కరోనా పాజిటివ్ తో చికిత్స పొందుతున్న రోగుల వద్దకు వెల్లి పరామర్శించిన ఒకే ఒక ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రేనని, తద్వారా కరోనా భయాన్ని తొలగించి ఆత్మస్థైర్యాన్ని నింపడంలో సీఎం ముందు వరుసలో ఉన్నారని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు.

ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు కె. తారక రామారావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే ఎ.జీవన్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, సీఎం సెక్రటరీ స్మితా సభర్వాల్, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, మున్సిపల్ డైరెక్టర్ సత్యనారాయణ, పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here