ఈ 9 పనులు ఆచరిస్తామని మాటివ్వండి – దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు

PM Modi Appeals Citizens To 9-Point Collective Pledge For Vikasit Bharath

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ఒక భావోద్వేగపూరితమైన పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన బుధవారం కర్ణాటకలో పర్యటించిన సందర్భంగా పేర్కొన్నారు. ఆదిచుంచనగిరి మఠాన్ని సందర్శించిన అనంతరం నిర్వహించిన సభలో ఆయన ప్రసంగిస్తూ, ‘వికసిత్ కర్ణాటక’ మరియు ‘వికసిత్ భారత్’ లక్ష్యాల సాధన కోసం ప్రజలు తొమ్మిది హామీలు ఇవ్వాలని కోరారు.

ఈ తొమ్మిది అంశాలను నిజాయతీగా పాటిస్తే దేశాభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. వ్యక్తిగత క్రమశిక్షణతో పాటు సామాజిక బాధ్యతను గుర్తు చేస్తూ ఆయన ఈ క్రింది అంశాలపై ప్రమాణం చేయాలని ప్రజలను కోరారు.

ప్రధాని మోదీ కోరిన తొమ్మిది హామీలు ఇవే..!

  1. నీటి పొదుపు: నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడటం.

  2. పరిశుభ్రత: బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడికక్కడ శుభ్రతను పాటించడం.

  3. పర్యావరణం: అమ్మ పేరుతో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం.

  4. స్వదేశీయత: ‘వోకల్ ఫర్ లోకల్’ నినాదంతో స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడం.

  5. పర్యాటక రంగం: దేశీయ పర్యాటక రంగ అభివృద్ధిలో భాగస్వాములు కావడం.

  6. ప్రకృతి వ్యవసాయం: రసాయనాలు లేని పంట సాగుకు ప్రాధాన్యం ఇవ్వడం.

  7. ఆరోగ్యకరమైన ఆహారం: ఆహారంలో చిరుధాన్యాలను (Millets) భాగం చేసుకోవడం.

  8. ఆరోగ్య సూత్రాలు: నూనె పదార్థాలను తగ్గించి, బరువును అదుపులో ఉంచుకోవడం.

  9. సేవా దృక్పథం: ఫిట్‌గా ఉంటూ ప్రకృతికి మరియు దేశానికి సేవ చేయడం.

సంక్షేమ పథకాలపై ప్రస్తావన:

ప్రసంగంలో భాగంగా ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను వివరించారు. ముఖ్యంగా ‘ఆయుష్మాన్ భారత్’ పథకం ద్వారా కోట్లాది మందికి ఉచిత వైద్యం అందుతోందని, ఇప్పుడు ఈ పథకాన్ని 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు కూడా వర్తింపజేస్తున్నామని వెల్లడించారు. తద్వారా వృద్ధాప్యంలో ఆరోగ్య భద్రత కల్పిస్తున్నామని చెప్పారు.

డీలిమిటేషన్ మరియు ఇతర అభివృద్ధి అంశాలపై దక్షిణాది ముఖ్యమంత్రులు మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంటి నేతలు తమ వాదనలు వినిపిస్తున్న తరుణంలో, ప్రధాని నేరుగా ప్రజలతో ఈ హామీలు తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

దేశ ఉజ్వల భవిష్యత్తుకు:

ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏ దేశమూ అభివృద్ధి చెందలేదని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. ఈ తొమ్మిది హామీలు కేవలం వ్యక్తిగత మార్పులే కాకుండా, దేశ ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాదులని ఆయన పేర్కొన్నారు. కర్ణాటక ప్రజలతో పాటు దేశ ప్రజలందరూ ఈ ప్రమాణాలను శ్రద్ధగా పాటిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here