జూలై 18వ తేదీ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన లోక్ సభ, రాజ్యసభ ఎంపీలతో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రేపు (జూలై 16, శనివారం) మధ్యాహ్నం ప్రగతిభవన్ లో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన విధివిధానాలు, వ్యూహంపై కీలకంగా చర్చించి, సీఎం కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలని ఎంపీలకు సీఎం కేసీఆర్ పిలుపు ఇవ్వనున్నట్టు తెలుస్తుంది.
“తెలంగాణకు అన్ని రంగాల్లో నష్టం చేసే విధంగా బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న తెలంగాణ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ పార్లమెంటు ఉభయసభల్లో తీవ్ర నిరసనను ప్రకటిస్తూ, పార్లమెంటు వేదికగా పోరాటానికి పూనుకోవాలని టీఆర్ఎస్ ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఆర్ధికంగా క్రమశిక్షణను పాటిస్తూ అనతి కాలంలో అభివృద్ధి పథంలో పయనిస్తున్న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రోత్సహించాల్సింది పోయి ఆర్థింకగా అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేయాలని కేంద్రం కుటిల ప్రయత్నాలు చేస్తుండడం పట్ల తెలంగాణ ప్రజా ఆకాంక్షలను అద్దం పడుతూ ఉభయ సభల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలని ఎంపీలకు సీఎం కేసీఆర్ సూచించనున్నారు” అని టీఆర్ఎస్ పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది.
“వ్యవసాయం, సాగునీరు, తదితర వ్యవసాయ అనుబంధ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక కార్యాచరణతో అనతి కాలంలోనే అందరి అంచనాలను మించి, ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే ముందంజలో తెలంగాణ నిలిచింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనకుండా రైతులు, మిల్లర్లు, ప్రభుత్వాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల పై పోరాడాలని ఎంపీలకు, సీఎం పిలుపునివ్వనున్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తున్న తెలంగాణ విషయంలో కేంద్రం పొంతనలేని ద్వంద్వం వైఖరిని, దుర్మార్గ విధానాన్ని నిలదీయాలి అని సీఎం కేసీఆర్ నిర్ణయించారు” అని తెలిపారు.
“దేశ అభివృద్ధి సూచి రోజురోజుకూ పాతాళానికి చేరుకుంటున్న ప్రమాదకర పరిస్థితుల్లో దేశాన్ని ఆర్థిక సంక్షోభం భారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత దేశ పౌరులుగా తెలంగాణ ప్రజలకున్నదని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. అందులో భాగంగా ప్రజాభిప్రాయం ప్రతిబింబించేలా రూపాయి పతనంపై కేంద్రాన్ని ఉభయ సభల సాక్షిగా నిలదీయాలని సీఎం కేసీఆర్ ఎంపీలకు సూచించనున్నారు. అదే సందర్భంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను నిరసిస్తూ పార్లమెంటు వేదికగా దేశ ప్రజల ఆకాంక్షలను చాటేలా గొంతు విప్పాలని, టీఆర్ఎస్ ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పోరాటంలో భాగంగా కలిసివచ్చే ఇతర రాష్ట్రాల విపక్ష ఎంపీలను కూడా కలుపుకుపోతూ, కేంద్రం మెడలు వంచి ప్రజాస్వామిక విలువలు కాపాడాల్సి వున్నదని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలు, దేశ ప్రజల తరఫున టీఆర్ఎస్ రాజ్యసభ, లోక్ సభ ఎంపీలు పార్లమెంటు ఉభయ సభల్లో కేంద్ర బీజేపీ ప్రభుత్వ అసంబద్ధ విధానాలను నిలదీస్తూ గళం విప్పాలని సీఎం కేసీఆర్ రేపటి సమావేశంలో ఎంపీలకు పిలుపు ఇవ్వనున్నారు” అని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY