బీఆర్ఎస్ లో మాజీల రాజీనామాలు.. త్వ‌ర‌లోనే..?

BRS, BRS Leaders, Telangana, KCR, Lok sabha elections, Thatikonda Rajaiah, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Mango News Telugu, Mango News
BRS, BRS Leaders, Telangana, KCR, Lok sabha elections

మూడు నెలల్లో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సీఎం అవుతార‌ని ఆ పార్టీకి చెందిన కొంద‌రు నేత‌లు అంటున్నారు. అందులో కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్ కూడా ఉన్నారు. ఈ క్ర‌మంలో కొంద‌రు కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌ను కొనేందుకు బీఆర్ ఎస్ ప్ర‌య‌త్నం చేస్తోంద‌న్న ప్ర‌చారం మొద‌లైంది. టీజేఎస్  అధ్య‌క్షుడు, ప్రొఫెస‌ర్ కోదండ‌రామ్ కూడా బీఆర్ ఎస్ డ‌బ్బుతో ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని ఆరోపించారు. ఈ త‌ర‌హా ప్ర‌చారాల నేప‌థ్యంలో నిన్న టీపీసీసీ అధ్య‌క్షుడు, ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర‌మైన స్థాయిలో స్పందించారు. అసలు.. ఎవడ్రా మా ప్రభుత్వాన్ని పడగొట్టేది.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే దమ్ముందా.. మాది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం.. మా ప్రభుత్వాన్ని పడగొడితే జనం ఊరుకుంటారా… అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయితే.. కాంగ్రెస్ ప్ర‌భుత్వం కూల‌డం సంగ‌తి అటుంచితే.. ఇప్పుడు బీఆర్ ఎస్ కు చెందిన కొంద‌రు కీల‌క నేత‌లు రాజీనామాలు చేస్తుండ‌డంతో న‌యా రాజ‌కీయాలు మొద‌లైన‌ట్లు క‌నిపిస్తోంది.

త్వ‌రలో జ‌ర‌గ‌బోయే లోక్ స‌భ ఎన్నిక‌ల త‌ర్వాత పార్టీల బ‌లాబ‌లాలు పూర్తి స్థాయిలో వెల్ల‌డ‌వుతాయి. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ను విజ‌యం వ‌రించినప్ప‌టికీ.. లోక్ స‌భ లోనూ మెజారిటీ సీట్లు సాధిస్తేనే ఆ పార్టీ విజ‌యం పాల‌పొంగేం కాద‌ని, ప్ర‌జ‌ల్లో నిజంగా ఆద‌ర‌ణ ఉంద‌ని స్ప‌ష్టం అవుతుంది. అలాగే.. బీఆర్ ఎస్ పై వ్యతిరేక‌త‌తోనే ఓట్లు వేశార‌ని, ఏదో గాలి కాద‌ని నిరూపితం అవుతుంది. రాష్ట్రంలో గెల‌వ‌బోయే ఎంపీ సీట్ల‌ను బ‌ట్టి ఆయా పార్టీల్లో జంపింగ్ లు, జంపాంగ్‌లు ఉంటాయ‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. అందుకే ఇప్ప‌టి వ‌ర‌కూ ఏ ఎమ్మెల్యే కూడా.. పార్టీలు మార‌డం కానీ, ఆ త‌ర‌హా ప్ర‌య‌త్నాలు కానీ చేయ‌డం లేద‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ప్ర‌భుత్వం కూలుతుంద‌న్న ప్ర‌చారం నేప‌థ్యంలో కాంగ్రెస్ ముందు జాగ్ర‌త్త‌గా బీఆర్ ఎస్ ఎమ్మెల్యేల‌తో ట‌చ్ లో ఉంద‌ని ఇటీవ‌ల ప‌రిణామాలు తెలియ‌జేస్తున్నాయి. ఇంత‌లోనే ఆ పార్టీకి చెందిన కొంద‌రు మాజీ ఎమ్మెల్యేలు, కీల‌క నేత‌లు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. స్థానిక రాజకీయాల్లోనూ మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటున్నాయి.

గత కొంతకాలంగా బీఆర్ ఎస్ పై అసంతృప్తితో ఉన్న తీగల కృష్ణారెడ్డి..  బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి.. త్వరలో కాంగ్రెస్ లో చేర‌నున్నారు. ఆయన ఇప్ప‌టికే సీఎం రేవంత్‌రెడ్డిని క‌లిశారు. తీగల బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా చేశారు. ఇటీవల శాసనసభ ఎన్నికల్లో మహేశ్వరం బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించిన ఆయనకు నిరాశ ఎదురైంది. ఇలా పార్టీ టికెట్ లభించకపోవడంతో  ఆయన కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఆయన కాంగ్రెస్‌లో చేరతారంటూ ప్రచారం జరిగింది. కానీ, పార్టీ నేతలతో అంతర్గత భేటీ అయినా తరువాత తన నిర్ణయాన్ని తాత్కాలికంగా ఆపేశారు. కానీ, ఆయన సీఎం రేవంత్‌ను కలవడంతో మరోసారి ఈ విషయం తెరపైకి వచ్చింది.  ఇదిలా ఉంటే.. రేవంత్‌ రెడ్డిని కలిసే ముందు తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు రంగారెడ్డిజిల్లా జడ్పీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి.. మంత్రి కొండా సురేఖని కలిసినట్టు తెలుస్తోంది. తరువాత కృష్ణారెడ్డి మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి,. కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌లతో సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు.

తీగల బాటలోనే ఇప్పుడు తెలంగాణ తొలి డిప్యూటీ సీఎం, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్‌ఎస్‌ కు రాజీనామా చేశారు. కాగా, గత ఎన్నికల్లో స్టేషన్‌ ఘన్‌పూర్‌ టికెట్‌ కోసం రాజయ్య ఎన్ని ప్రయత్నాలు చేసినా కేసీఆర్‌ ఆయనకు టిక్కెట్‌ ఇవ్వలేదు.  ఆయన స్థానంలో కడియం శ్రీహరికి టికెట్‌ ఇచ్చారు. దీంతో అప్పటి నుంచే ఆయన తీవ్ర సంతృప్తితో  అసహనంతో ఉన్న ఆయన  వరంగల్‌ లోక్‌ సభ టిక్కెట్‌ ఇవ్వాల్సిందిగా  బీఆర్‌ఎస్‌ అధిష్ఠానాన్ని కోరారు. అయితే  సానుకూల స్పందన రాకపోవడంతో పార్టీ వీడాలని నిర్ణయించుకున్నారు. తన అనుచరులతో  చర్చించిన తర్వాత పార్టీకి గుడ్‌ బై చెప్పడమే బెటర్‌ అనే నిర్ణయానికి ఆయన వచ్చారు. అందుకనుగుణంగా  ఈ రోజు రాజీనామా చేశారు.  కాంగ్రెస్‌ గూటికి చేరేందుకు ఇప్పటికే ఆయన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో చర్చలు జరిపారు. సీఎం రేవంత్‌ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్‌ లో చేరే అవకాశం ఉంది.

వీరే కాకుండా.. కార్పొరేష‌న్లు, మునిసిపాలిటీల్లో చాలా మంది నేత‌లు బీఆర్ ఎస్ కు రాజీనామా చేశారు. ఇంకా చాలా మంది చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. వరంగల్ జిల్లా​ నర్సంపేట పట్టణం బీఆర్​ఎస్​ పార్టీలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. బీఆర్ఎస్​ ఛైర్​ పర్సన్​ గుంటి రజనీకిషన్​ ఒంటెద్దు పోకడలను నిరసిస్తూ వైస్​ ఛైర్​ పర్సన్​తో సహా 14 మంది గులాబీ పార్టీ కౌన్సిలర్లు రాజీనామా బాట పట్టారు. ఈ మేరకు నిర్వహించిన సమావేశంలో మూకుమ్మడిగా బీఆర్​ఎస్​ పార్టీకి రాజీనామా చేశారు. నర్సంపేట మున్సిపాలిటీలో నూ రాజీనామాకు సిద్ధంగా ఉన్నారు. ప్ర‌స్తుతం బీఆర్ ఎస్ ను వీడుతున్న నేత‌ల ప‌రిస్థితి ఇలా ఉంటే.. లోక్ స‌భ ఎన్నిక‌ల త‌ర్వాత కొంద‌రు ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం ఆ పార్టీకి బ‌లం స‌రిప‌డా ఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌భుత్వంపై కుట్ర‌ల నేప‌థ్యంలో కాంగ్రెస్ కూడా ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ కు సిద్ధంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. లోక్ స‌భ ఎన్నిక‌ల త‌ర్వాత ఎవరు ఎటువైపు అనే దానిపై స్ప‌ష్ట‌త రానుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 9 =