డిసెంబర్ 3 నుంచి టీఎస్‌ఆర్టీసీలో పెరిగిన ధరలు అమలు

Hiked TSRTC Bus Fares, Mango News Telugu, Political Updates 2019, RTC Bus Charges Hike, telangana, Telangana Breaking News, Telangana Political Live Updates, Telangana Political Updates, Telangana Political Updates 2019, TSRTC Latest News

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెను విరమించిన అనంతరం వారిని ఎటువంటి షరతులు లేకుండా విధుల్లో చేరమని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆర్టీసీ విధానాల్లో పలు మార్పులు తీసుకొస్తూ, చార్జీలు పెంచేందుకు కూడా ఆర్టీసీ యాజమాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలను కిలోమీటరుకు 20 పైసలు పెంచుతూ, కనీస బస్సు చార్జీల వివరాలను అధికారులు ఈ రోజు ప్రకటించారు. పెంచిన టికెట్‌ చార్జీలు డిసెంబర్ 3 నుంచి అమల్లోకి వస్తాయి. పల్లె వెలుగు బస్సులో కనీస చార్జీ రూ.5 నుంచి రూ.10కి ఆర్టీసీ పెంచింది. అలాగే ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో కనీస చార్జీ రూ.15, డీలక్స్‌ బస్సుల్లో రూ.20, సూపర్‌ లగ్జరీలో రూ.25, రాజధాని, వజ్ర, గరుడ, గరుడ ప్లస్‌ బస్సుల్లో రూ.35 గా పెంచారు. వెన్నెల ఏసీ స్లీపర్‌ బస్సుల్లో కనీస చార్జీని ఆర్టీసీ రూ.75 చేసింది.

కనీస చార్జీపై కిలోమీటర్‌కు 20 పైసలు అధికంగా వసూలు చేయాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. పల్లె వెలుగు పై కిలోమీటర్‌కు 83 పైసలు, సెమీ ఎక్స్‌ ప్రెస్‌పై 95 పైసలు, ఎక్స్‌ప్రెస్‌పై 107 పైసలు, డీలక్స్‌పై 118 పైసలు, సూపర్‌ లగ్జరీ ఎక్స్‌ప్రెస్‌పై 136 పైసలు, రాజధాని ఏసీ, వజ్ర బస్సుపై 166 పైసలు, గరుడ ఏసీపై 191 పైసలు, గరుడ ప్లస్ ఏసీ పై 202 పైసలు వసూలు చేయాలనీ నిర్ణయించుకున్నారు. మరోవైపు సిటీ ఆర్డీనరీ బస్‌పాస్‌ చార్జీ రూ.770 నుంచి రూ.950కి పెంచారు. మెట్రో బస్‌ పాస్‌ రూ.880 నుంచి రూ.1,070కి, మెట్రో డీలక్స్‌ బస్‌పాస్‌ చార్జీ రూ.990 నుంచి రూ.1180కి పెంచారు. హైదరాబాద్ లో మూడునెలల సాధారణ స్టూడెంట్‌ బస్‌పాస్‌ లను రూ.390 నుంచి రూ.495కి పెంచారు.

[subscribe]