ఆంధ్రప్రదేశ్ అధికారులు గైర్హాజరు కావడంతో నేడు హైదరాబాద్‌లో జరగాల్సిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) సమావేశం మరోసారి వాయిదా పడింది. బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన జరగాల్సిన ఈ భేటీకి కొన్ని రోజుల ముందుగానే ఉభయ రాష్ట్రాల అధికారులకి సమాచారం ఇచ్చినప్పటికీ ఏపీ అధికారులు హాజరు కాలేదని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ అన్నారు. ఈ భేటీకి తెలంగాణ ప్రభుత్వం తరపున ఈఎన్‌సీ మురళీధర్, సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండే, ఇరిగేషన్ ఇంజినీర్లు హాజరయ్యారు. అయితే ఏపీకి చెందిన అధికారులెవరూ ఈ సమావేశానికి రాకపోవడంతో వాయిదా వేయక తప్పలేదు. తెలంగాణ రాష్ట్ర సభ్యులు సమావేశానికి హాజరై తమ అభిప్రాయాలను తెలియజేసేందుకు సిద్ధమయ్యారని, కానీ సమావేశం వాయిదా పడటంతో వారు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారని రజత్ కుమార్ చెప్పారు.
తెలంగాణకు సంబంధించిన మూడు ప్రాజెక్టుల డీపీఆర్‌లకు బోర్డు ఆమోదం తెలపాలని, భేటీలు వరుసగా వాయిదాలు పడటంతో అనుమతులకు ఆలస్యమవుతోందని రజత్ కుమార్ తెలిపారు. తెలంగాణ లోని సీతమ్మసాగర్, తుపాకులగూడెం ప్రాజెక్టులకు హైడ్రలాజికల్ అనుమతులు వచ్చాయని, త్వరలోనే మిగిలిన ప్రాజెక్టులకు కూడా అనుమతులు రావొచ్చని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ముందుగా అనుకున్న ప్రకారం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలకు చెందిన అధికారులతో జీఆర్‌ఎంబీ కీలక సమావేశం జరగాల్సి ఉంది. ఉభయ రాష్ట్రాల పరిధిలోని అన్ని ప్రాజెక్టులలో రివర్ మేనేజ్‌మెంట్‌లు చేపట్టడం, ప్రస్తుతం కొనసాగుతున్న అన్ని ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వ నియంత్రణను సమర్ధవంతంగా అందజేయడం దీని ప్రధానోద్దేశం. కాగా ఏపీ సభ్యుల గైర్హాజరుతో మార్చి 11న కూడా భేటీ వాయిదా పడిన విషయం తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ