ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భవనాన్ని, రైతు వేదికను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Minister KTR Inaugurates Government Degree College in Gambhiraopet, Sircilla District

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం నాడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ముందుగా జిల్లాలోని గంభీరావుపేట మండల కేంద్రంలో రూ.2.25 కోట్లతో నిర్మించిన నూతన ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం గంభీరావుపేట మండలంలో రూ.2.26 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను మంత్రి ప్రారంభించారు. అలాగే తన సొంత నిధులతో నిర్మించిన రైతు వేదిక భవనాన్ని ప్రారంభించారు. అనంతరం స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి కళ్యాణలక్ష్మి చెక్కులను మంత్రి కేటీఆర్ అందజేశారు. ఈ కార్యక్రమాల్లో తెలంగాణ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రారంభోత్సవం సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, గంభీరావుపేట‌లోని ఈ కాలేజీ ఆవరణలో శిథిలావ‌స్థ‌లో ఉన్న భ‌వ‌నాల‌ను తొల‌గించి కేజీ టూ పీజీ ఒకే ఆవ‌ర‌ణ‌లో ఉండే విధంగా మార్పులు చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. అలాగే తొందర్లోనే ఎల్లారెడ్డిపేట‌లో కూడా డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేసే బాధ్య‌త త‌న‌దని మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ఈ కాలేజీకి అందుబాటులో ఉన్న రెండు బిల్డింగ్స్ ను పరిశీలించి విద్యార్థినుల కోసం హాస్ట‌ల్‌ను వెంట‌నే వినియోగంలోకి తీసుకురావాల‌ని జిల్లా కలెక్టర్ కు సూచించారు. కంప్యూటర్ ల్యాబ్స్ కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. సీఎం కేసీఆర్ నాయ‌క‌త్వంలో దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా అత్య‌ధిక సంఖ్యలో గురుకుల పాఠశాలలు కలిగిఉన్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. మొత్తం 945 గురుకుల పాఠ‌శాల‌లలో ఒక్కో విద్యార్థి మీద, విద్యార్థిని మీద లక్ష 27 వేల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తుందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ