ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు పంపడంపై ఆమె సోదరుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. గురువారం దీనిపై ఆయన తెలంగాణ భవన్‌లో మంత్రులతో కలిసి ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ మరియు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కవితకు వచ్చింది ఈడీ సమన్లు కాదు, మోదీ సమన్లని అభివర్ణించారు. తమకు సంబంధం లేని కేసులో ఏదో జరుగుతోందని ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని మోదీ చేతుల్లో ఈడీ కీలుబొమ్మగా, సీబీఐ తోలుబొమ్మగా మారిందని మంత్రి తీవ్ర ఆరోపణలు చేశారు.
ఇక వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని కలలు కంటున్న బీజేపీ పెద్దలు, దీనికోసం వారికి అలవాటైన పద్దతిలోనే వస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇప్పటికే తమ మంత్రులపై ఈడీ, సీబీఐ, ఐటీ వంటి కేంద్ర సంస్థలతో దాడులు చేయించారని.. ప్రత్యర్థులపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పడం బీజేపీ నైజమని ఆరోపించారు. ఈ సందర్భంగా మంత్రులు గంగుల కమలాకర్, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్ రెడ్డి, లోక్‌సభలో బీఆర్ఎస్ నేత నామా నాగేశ్వర రావు, రాజ్యసభలో బీఆర్ఎస్ నేత రవిచంద్ర, పార్థసారథి, మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎల్ రమణ, రోహిత్ రెడ్డి తదితర నేతలపై, వారి కుటుంబ సభ్యులపై కేంద్ర సంస్థల దాడులను ఆయన ప్రస్తావించారు. ఇక దేశంలో నీతిలేని పాలన ఉండగా.. నిజాయితీ లేని దర్యాప్తు సంస్థలు ఉన్నాయని, ప్రతిపక్షాలపై కేసుల దాడి చేస్తూ.. ప్రజలపై ధరల దాడి చేస్తున్నారని మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
ఇక ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, ప్రధాని మోదీకి బినామీ అని దేశంలో ప్రతి ఒక్కరికీ తెలుసనీ, అదానీ గ్రూప్ కంపెనీలకు చెందిన దాదాపు రూ.13 లక్షల కోట్లు సంపద ఆవిరైతే ప్రధాని గానీ, కేంద్ర ఆర్థిక మంత్రి గానీ స్పందించలేదని, కనీస చర్యలు లేవని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. అలాగే అదానీ నిర్వహణలో ఉన్న ముంద్రా పోర్టులో 21 వేల కోట్ల విలువైన 3వేల కేజీల హెరాయిన్ దొరికినా చర్యలు లేవని, నిబంధనలకు విరుద్ధంగా 6 పోర్టులను అదానీకి ఇచ్చారని కేటీఆర్ ఆరోపించారు. అంతేకాకుండా ఎల్ఐసీ డబ్బులు వేలకోట్లు నష్టపోయినా ప్రధాని స్పందించలేదని, మోదీ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని విరుచుకు పడ్డారు. కాగా దేశంలో ప్రతిపక్షాలు అనేవి లేకుండా చేయాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారని, అందుకే వారికి గిట్టని వారిపైకి ఈడీ, సీబీఐతో దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ప్రధాన స్లోగన్ అయిన ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ అంటే.. కేంద్రం-రాష్ట్రం కాదని, ఒకటి ప్రధాని మోదీ అయితే, మరొకటి అదానీ అని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE