హైద‌రాబాద్ న‌గ‌రాన్ని హెరిటేజ్ సిటీగా యునెస్కో గుర్తించేలా కృషి చేస్తాం – మంత్రి కేటిఆర్

KTR, KTR visits MJ Market, KTR visits Moazzam Jahi Market, Minister KTR, Minister KTR Visited Newly Renovated Mozamjahi Market, MJ Market, MJ Market renovation, Mozamjahi Market, Newly Renovated Mozamjahi Market

హైద‌రాబాద్ న‌గ‌రాన్ని యునెస్కో హెరిటేజ్ సిటీగా గుర్తించుట‌కు తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు రాష్ట్ర పుర‌పాల‌క, ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కె.తార‌క‌రామారావు తెలిపారు. ఆగస్టు 14, శుక్ర‌వారం సాయంత్రం పున‌ర్‌వైభ‌వం క‌ల్పించిన మోజంజాహి మార్కెట్ ను లాంఛ‌నంగా ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ, హైద‌రాబాద్ న‌గ‌రం భిన్న సంస్కృతుల‌కు నిల‌యంగా ఉన్న‌ద‌ని పేర్కొన్నారు. న‌గ‌రంలో అనేక చారిత్ర‌క నిర్మాణాలు ఉన్నాయ‌ని, వాటిని పునరుజ్జీవింప చేయుట‌కు ప్ర‌భుత్వం ప్ర‌త్యేక శ్ర‌ద్ద తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. అందులో భాగంగా రూ.15 కోట్ల వ్య‌యంతో మోజంజాహి మార్కెట్ కు పూర్వ‌వైభ‌వం క‌ల్పించిన‌ట్లు తెలిపారు. రెండు సంవ‌త్స‌రాల క్రితం ఈ మార్కెట్‌ను సంద‌ర్శించిన‌ట్లు తెలిపారు. అద్వాన్న‌ స్థితిలో ఉన్న మోజంజాహి మార్కెట్‌ను చూసిన‌ప్పుడు చాలా బాద‌క‌లిగిన‌ట్లు తెలిపారు. 1935లో నిజాం పాల‌కులు నిర్మించిన ఈ చారిత్ర‌క క‌ట్ట‌డం వైభ‌వాన్ని పున‌రుజ్జీవంప‌జేసేందుకు రాష్ట్ర పుర‌పాల‌క శాఖ నుండి నిధులు మంజూరు చేసిన‌ట్లు తెలిపారు. ఈ మార్కెట్‌ను ద‌త్త‌త తీసుకొని, స్వ‌యంగా ప‌ర్య‌వేక్షిస్తూ తుదిరూపు తెచ్చిన‌ పుర‌పాల‌క శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రి అర్వింద్ కుమార్ ను మంత్రి అభినందించారు.

రాష్ట్ర ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్‌రావు చ‌దువుకునే రోజుల్లో మోజంజాహి మార్కెట్ స‌మీపంలో ఉన్న మ‌యూరి హోట‌ల్‌లో ఉండేవార‌ని గుర్తు చేశారు. గ‌తంలో ఈ మార్కెట్‌లో విక్ర‌యించే ఐస్‌క్రీమ్‌ల‌కు చాలా గుర్తింపు ఉన్న‌ద‌ని తెలిపారు. పున‌రుజ్జీవంతో పాటు ఆగ‌ష్టు 15 స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఈ మార్కెట్ నందు 100 అడుగుల జాతీయ జెండాను ఏర్పాటు చేయ‌డం ప‌ట్ల ముఖ్య‌మంత్రి కేసీఆర్ సంతోషిస్తార‌ని తెలిపారు. మ‌నంద‌రం గర్వ‌ప‌డేవిధంగా పున‌ర్‌వైభ‌వం క‌ల్పించిన ఈ చారిత్ర‌క క‌ట్ట‌డాన్ని ప‌రిర‌క్షించుకోవ‌డం మ‌నంద‌రి బాధ్య‌త అని పేర్కొన్నారు. రూ.1,000 కోట్ల‌తో యాదాద్రి ల‌క్ష్మిన‌ర్సిహ్మా స్వామి ఆల‌యాన్ని పున‌రుద్ద‌రిస్తున్న‌ట్లు తెలిపారు. కుల‌, మ‌తాల‌కు అతీతంగా చారిత్ర‌క అపురూప వార‌స‌త్వ నిర్మాణాల‌ను ప్ర‌భుత్వం ప‌రిర‌క్షిస్తున్న‌ట్లు మంత్రి కేటిఆర్ తెలిపారు. ఈ సంద‌ర్భంగా మోజంజాహి మార్కెట్ వైభ‌వంపై ముద్రించిన పుస్త‌కాన్ని మంత్రి కేటిఆర్ ఆవిష్క‌రించారు. అదేవిధంగా మోజంజాహి మార్కెట్‌కు పున‌ర్‌వైభ‌వం క‌ల్పించుట‌లో విశిష్ట సేవ‌లు అందించిన 16 మందిని మెమోంటోల‌తో గౌర‌వించారు.

ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర మంత్రులు మహ్మద్ మహమూద్ అలి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, పి సబితా ఇంద్రారెడ్డి, న‌గ‌ర‌ మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీ లు అసదుద్దీన్ ఓవైసీ, కె.కేశవరావు, ఎమ్మెల్యే రాజాసింగ్, డిప్యూటీ మేయర్ మహ్మద్ బాబా ఫసీయుద్దీన్, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అర్వింద్ కుమార్, జి.హెచ్ఎం.సి కమీషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, జోనల్ కమీషనర్ ప్రావీణ్య, డిప్యూటి క‌మిష‌న‌ర్ విన‌య్ క‌పూర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu