తెలంగాణ బీజేపీకి కొత్త కోచ్ వచ్చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కోచ్ లేకుండానే బరిలో దిగిన భారతీయ జనతా పార్టీ బలం పుంజుకున్నా కూడా తాము ఆశించిన స్థాయిలో ఫలితాలు దక్కలేదు. దీంతో పార్లమెంట్ ఎన్నికల కోసం తాజాగా తెలంగాణ బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్‌ను నియమించారు. అయితే పార్లమెంటు ఎన్నికల కోసం బీజేపీ నేతలను చంద్రశేఖర్ ఏకంగా చేయగలరా.. అసలు చంద్రశేఖర్ ముందున్న సవాళ్లేంటన్న చర్చ మొదలయింది.
ఎట్టకేలకు చాలా రోజులుగా ఖాళీగా ఉన్న ఆర్గనైజింగ్ సెక్రటరీ పోస్టును బీజేపీ హైకమాండ్ భర్తీ చేసింది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్‌తో పార్టీకి ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని.. సంస్థాగత కార్యదర్శి లేకపోతే ఎదురైన ఇబ్బందులను పార్లమెంటు ఎన్నికలలో అధిగమించడానికి బీజేపీ అధిష్టానం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
జాతీయ సంస్థాగత కార్యదర్శిగా బి.ఎల్ సంతోష్ ఎంత పవర్ ఫుల్ పోస్టులో ఉన్నారో .. రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర సంస్థాగత కార్యదర్శి అంతే పవర్ ఫుల్ పోస్టులో ఉన్నట్లు అవుతుంది. ఇటీవల రాజస్థాన్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ పవర్ లోకి రావడానికి తెరవెనక కీలకంగా పని చేసిన చంద్ర శేఖర్‌కు తెలంగాణ బాధ్యతలను అప్పగించారు.
రాజస్థాన్ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా అసెంబ్లీ ఎన్నికలలో చంద్రశేఖర్ సక్సెస్ ఫుల్ అవడంతో అధిష్టానం చూపు ఆయనపై పడింది. వసుంధర రాజే లాంటి రాటు తేలిన సీనియర్ నేతలను పార్టీలో సైలెంట్ చేసి.. చంద్రశేఖర్‌కు తెలంగాణ బాధ్యతలు అప్పగించడంలో ఏదో ఆంతర్యం ఉండే ఉంటుందన్న టాక్ నడుస్తోంది.
ఉత్తరప్రదేశ్ కి చెందిన చంద్రశేఖర్ రాజకీయ నిర్ణయాల్లో చాలా కఠినంగా వ్యవహరిస్తారట. గతంలో తెలంగాణకు ఆర్గనైజింగ్ సెక్రటరీగా మంత్రి శ్రీనివాస్ బాధ్యతలు నిర్వర్తించారు. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బండి సంజయ్‌కు మంత్రి శ్రీనివాస్ పొసగకపోవడంతో.. మంత్రి శ్రీనివాస్‌ను పంజాబ్, హర్యానా సంస్థాగత కార్యదర్శిగా బదిలీ చేశారు. అప్పటి నుంచి కోచ్ లేరు. అలాగే తెలంగాణ బీజేపీ టీమ్.. అసెంబ్లీ ఎన్నికలను పూర్తి చేసింది.
ఇటు కొంతకాలంగా తెలంగాణలో బీజేపీ నేతల మధ్య అంతర్గత కలహాలు, ఆధిపత్యపోరు పార్టీలో కొనసాగుతోంది. కొన్నాళ్లుగా నేతల మధ్య సమన్వయ లేమి కొట్టొచ్చనట్లు కనిపిస్తోంది. పార్లమెంటు ఎన్నికలలో ఈ సమస్య తలెత్తకుండా.. అత్యధిక పార్లమెంట్ సీట్లను సాధించడం ఇప్పుడు చంద్రశేఖర్ ముందున్న పెద్ద సవాల్‌గా నిలిచింది. మరి దీనిని చంద్రశేఖర్ సమర్ధవంతంగా ఎదుర్కొంటారో లేదో వేచి చూడాల్సిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE