తెలంగాణలో అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఏర్పాట్లు పరిశీలన

Telangana Speaker and Council Chairman Monitored Arrangements in Assembly

తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 7 నుంచి శాసనసభ, శాసన మండలి సమావేశాలను నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శాసనసభ, శాసనమండలి సమావేశ మందిరాలను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఈ రోజు పరిశీలించారు. అసెంబ్లీ సమావేశ మందిరాన్ని, మీడియా, విజిటర్స్ గ్యాలరీని, స్పీకర్ ఛాంబర్ , శాసన సభ్యుల ప్రవేశ ద్వారాన్ని, శాసనమండలిని పరిశీలించారు.

సభ లోపల భౌతిక దూరం పాటించే విధంగా సభ్యులకు సీట్లను ఏర్పాటు చేయాలనే అంశంపై వివిధ కోణాలలో సీటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఏర్పాట్లపై తీసుకుంటున్న చర్యలను లెజిస్లేచర్ సెక్రటరీ డా. వి.నరసింహా చార్యులు వారికీ వివరించారు. ఈ సందర్భంగా సభ లోపల సభ్యులు కూర్చునే సీట్ల కేటాయింపు విషయాలు, కరోనా సోకకుండా తగు జాగ్రత్తల తీసుకోవలసిన అవసరంతో పాటుగా, సమావేశాలలో సభ్యులకు సౌకర్యవంతంగా ఉండి, యాక్టివ్ గా పాల్గొనే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని లెజిస్లేటివ్ సెక్రటరీ, వివిధ శాఖల అధికారులకు వారు సూచించారు. సెప్టెంబర్ ఒకటో తేదీ నాటికి ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.

అదేవిధంగా కరోనా లక్షణాలు ఉన్న సభ్యులను, వ్యక్తులను గుర్తించే విధంగా అసెంబ్లీ, మండలి బయట, లోపల ఏర్పాటు చేసిన అధునాతన పరికరాల పని తీరుని అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్ కు అధికారులు చూపించారు. కరోనా మహమ్మారి నేపధ్యంలో నిర్వహిస్తున్న ఈ సమావేశాలు ప్రత్యేకమైనవి. ఎట్టి పరిస్థితుల్లోనూ జాగ్రత్తగా వ్యవహరించాలని, అదే సమయంలో సమావేశాలకు హాజరయ్యే శాసన సభ, మండలి సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి ప్రశాంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. గౌరవ సభ్యులు, అధికారులు, మీడియా ప్రతినిధులు కూడా ఈ ప్రత్యేక పరిస్థితులలో సహకరించాలని వారు కోరారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu