టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట నుంచి రంగారెడ్డి రావిరాల వరకు చేపట్టిన ‘రాజీవ్ రైతు భరోసా పాదయాత్ర’ మంగళవారంతో ముగిసింది. మొత్తం 149 కి.మీ మేర రేవంత్‌రెడ్డి పాదయాత్ర చేశారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా రావిరాలలో “రాజీవ్ రైతు రణభేరి” సభ నిర్వహించారు. ఈ సభలో ప్రసంగిస్తూ రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. తన పాదయాత్రతో ఉప్పెన సృష్టిస్తానని పేర్కొన్నారు. ఈసారి పాదయాత్ర కోసం ఏఐసీసీ అనుమతి తీసుకుంటానని, రోడ్‌మ్యాప్ వేసి వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. నూతన వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రాజీవ్ రైతు రణభేరి సభలో సీతక్క, మల్లురవి, చిన్నా రెడ్డి, కొండా సురేఖ, షబ్బీర్ అలీ, పొన్నం ప్రభాకర్ సహా పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ముందుగా కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా, పంటలకు మద్దతు ధర డిమాండ్ తో అచ్చంపేటలో ఫిబ్రవరి 7 న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ రైతు భరోసా పేరుతో రేవంత్ రెడ్డి ఒకరోజు నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే సీతక్క, ఇతర పార్టీ నాయకులు రేవంత్ రెడ్డిని పాదయాత్ర చేయాలని కోరారు. దీంతో రాజీవ్ రైతు భరోసా దీక్షను రేవంత్ రెడ్డి పాదయాత్రగా మార్చుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే అచ్చంపేట నుంచి రంగారెడ్డి రావిరాల వరకు 149 కిమీ పాదయాత్ర చేసి ముగింపు రోజున సభ నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ