తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుతాన్ని డిమాండ్ చేస్తూ టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తున్నాయి. టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు బుధవారం నాడు నాగపూర్, ముంబయి, బెంగళూరు, విజయవాడ వంటి జాతీయ రహదారులను దిగ్బంధం చేసి, రహదారులపై టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. రాష్ట్ర మంత్రులు సహా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, రైతులు, కార్యకర్తలతో కలిసి హైదరాబాద్-విజయవాడ, నాగపూర్, ముంబయి, బెంగళూరు జాతీయ రహదారులపై రాస్తారోకో నిర్వహిస్తున్నారు. తెలంగాణలో యాసంగి వరి ధాన్యం మొత్తాన్ని కేంద్రమే కొనాలని డిమాండ్ చేస్తూ, కేంద్ర వైఖరికి వ్యతిరేకంగా ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తున్నారు.
మరోవైపు ధాన్యం కొనుగోళ్ళ అంశంపై కేంద్రంపై పోరులో భాగంగా ఏప్రిల్ 7న హైదరాబాద్ మినహా మిగిలిన 32 జిల్లా కేంద్రాల్లో టీఆర్ఎస్ పార్టీ నిరసన దీక్షలు చేపట్టనుంది. ఏప్రిల్ 8న రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించడం, ప్రతి రైతు, టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఇండ్లపై నల్లా జెండా ఎగురవేయాలని మంత్రి కేటీఆర్ కార్యాచరణ ప్రకటించారు. ఇక ఏప్రిల్ 11వ తేదీన టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేతృత్వంలో ఢిల్లీలో పెద్దస్థాయిలో నిరసన దీక్ష చేపట్టనున్నారు. ఈ దీక్షలో రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్‌ల చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, రైతుబంధు సమితి అధ్యక్షులు, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మున్సిపల్ చైర్మన్లు మేయర్లు, టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు పాల్గొననున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ