నిజామాబాద్ జిల్లాలో పలు మండలాల్లో పసుపు రైతులు ఆందోళనకు దిగారు. తక్షణమే పసుపు బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు పసుపుకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. పసుపు బోర్డు తీసుకు వస్తానని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, మాట తప్పే పక్షంలో తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు జగిత్యాలలోనూ పసుపు రైతులు ఆందోళనకు దిగారు. జిల్లా కేంద్రంలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ నగరంలో పసుపు రైతులు ప్రదర్శన నిర్వహించారు. జగిత్యాల- కరీంనగర్ రహదారిపై రాస్తారోకో నిర్వహించడంతో పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు. అనంతరం ఆందోళనలో భాగంగా జగిత్యాల నుంచి నిజామాబాద్ జిల్లాలోని ఆర్ముర్ వరకు పాదయాత్రగా వెళ్తున్నారు. పసుపు రైతులకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులేస్తున్నామని, రైతులకు పసుపు బోర్డు కన్నా మంచి పరిష్కారం కోసం కేంద్రం నిర్ణయం తీసుకోబోతుందని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆదివారం నాడు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పసుపు బోర్డు సాధ్యం కాదన్నా వ్యాఖ్యలపై రైతులు స్పందిస్తూ పలు ప్రాంతాల్లో నిరసనలు నిర్వహిస్తున్నారు.
[subscribe]