తెలంగాణ శాసనసభలో ఆదివారం బడ్జెట్ చర్చల సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తీరును, ఆ పార్టీ అనుసరిస్తున్న రాజకీయ వ్యూహాలను తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్పీకర్ గెడ్డం ప్రసాద్ కుమార్ దళిత వర్గానికి చెందిన వారు కావడమే కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి ప్రధాన కారణమని రేవంత్ ఆరోపించారు.
దళితుల పట్ల వివక్ష.. కేసీఆర్ వైఖరిపై ధ్వజం
తెలంగాణ సాధిస్తే దళితుడినే తొలి ముఖ్యమంత్రిని చేస్తానని నమ్మబలికిన కేసీఆర్, తీరా రాష్ట్రం ఏర్పడ్డాక మాట తప్పారని రేవంత్ రెడ్డి విమర్శించారు. కడియం శ్రీహరి, జి.వివేక్ వంటి నేతలు సీఎం అవుతారని ఆశించినా, దళితులకు పరిపాలన చేతకాదంటూ వారిని కేసీఆర్ అవమానించారని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో భట్టి విక్రమార్క ప్రతిపక్ష నేతగా ఉండటాన్ని ఓర్వలేక, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకుని ఆ పదవిని తొలగించడంలో కేసీఆర్ పైశాచికానందం పొందారని రేవంత్ గుర్తుచేశారు.
“దళిత స్పీకర్ పైన కూర్చుంటే, దొరబిడ్డనైన తాను కింద కూర్చోవాలా? ఎదురుగా నిలబడి మైక్ అడగాలా?” అనే అహంకారంతోనే కేసీఆర్ సభకు గైర్హాజరవుతున్నారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. దళితులను చిన్నచూపు చూసే వారికి కనువిప్పు కలగాలనే తాము ప్రసాద్ కుమార్‌ను స్పీకర్ స్థానంలో, భట్టి విక్రమార్కను ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక మంత్రి హోదాలో కూర్చోబెట్టామని స్పష్టం చేశారు.
కేసీఆర్ రాజీనామా చేయాలి.. పొంగులేటిపై ఆరోపణలకు కౌంటర్
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబంపై వస్తున్న మైనింగ్ ఆరోపణలపై స్పందిస్తూ, అక్రమాలు ఎవరివైనా సరే సీబీసీఐడీ విచారణకు సిద్ధమని సీఎం ప్రకటించారు. అయితే మంత్రి రాజీనామా చేయాలంటున్న బీఆర్‌ఎస్ నేతలకు రేవంత్ గట్టి కౌంటర్ ఇచ్చారు.
“కోటి 10 లక్షల జీతం తీసుకుంటూ, సభకు రాకుండా ఇంట్లో కూర్చున్న కేసీఆర్ ముందు రాజీనామా చేయాలి” అని డిమాండ్ చేశారు. లక్షలాది ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తున్న మంత్రిని రాజీనామా చేయమనడం హాస్యాస్పదమని, ప్రతిపక్షం అహంకారంతో చెప్పినట్లు ప్రభుత్వం నడవదని హెచ్చరించారు. పార్టీ ఫిరాయింపుల సంస్కృతికి జాతి పితామహులు బీఆర్‌ఎస్ నేతలేనని ఎద్దేవా చేశారు.
బాలానగర్ భూములపై హౌస్ కమిటీకి సవాల్
హరీష్ రావు బంధువులు మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ పరిధిలో వందల ఎకరాల భూములను ఆక్రమించుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. దీనిపై విచారణకు హౌస్ కమిటీ వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కేటీఆర్ మరియు హరీష్ రావు దీనికి అంగీకరిస్తారా? అని సవాల్ విసిరారు.
ధరణిని అడ్డుపెట్టుకుని పరిశ్రమల యజమానులను బ్లాక్ మెయిల్ చేసి భూములు స్వాహా చేశారని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబంలో అంతర్గత తగాదాల వల్లే సభను అడ్డుకుంటున్నారని, కేటీఆర్ అనుచరులు సిరిసిల్లలో చేసిన అక్రమ భూ ఆక్రమణలను కూడా ప్రభుత్వం వదిలిపెట్టదని స్పష్టం చేశారు.
బీజేపీ-బీఆర్‌ఎస్ చీకటి ఒప్పందంపై విమర్శలు
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణను ఢిల్లీలో తొక్కిపెట్టారని రేవంత్ రెడ్డి బీజేపీని విమర్శించారు. కాళేశ్వరం ఏటీఎం అని ప్రధాని మోదీ అన్నారని, కిషన్ రెడ్డి కోరినట్లు తాము విచారణకు అప్పగించినా ఎనిమిది నెలలుగా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి ఓట్లు, సీట్లు పంచుకుంటున్నాయని ఆరోపించారు. ఖనిజ సంపదలో అక్రమాలను అరికట్టి ఆదాయం పెంచేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని, 2014 నుంచి జరిగిన అన్ని మైనింగ్ అక్రమాలపై సీబీసీఐడీ విచారణ జరిపి నిగ్గు తేలుస్తామని సీఎం రేవంత్ సభలో ప్రకటించారు.









































