ప్రధాని మోదీ దేశ యువతకు క్షమాపణ చెప్పాలి – కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ

LoP Rahul Gandhi Condemns Police Action on Protesting Students Over NEET Leak Issue

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హయాంలో దేశంలో విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, గత పదేళ్లలో ఏకంగా 152 పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ఆరోపించారు. సగటున నెలకు ఒక పేపర్ లీక్ అవుతున్నప్పటికీ, ఈ అక్రమాలకు బాధ్యులైన వారికి పడిన శిక్షలు మాత్రం ‘సున్నా’ అని ఆయన మండిపడ్డారు.

ఢిల్లీలోని ఇందిరా గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నీట్ ప్రశ్నపత్రాల లీకేజీకి నిరసనగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు తీవ్రస్థాయిలో లాఠీచార్జ్ చేయడాన్ని ఖండిస్తూ, గాయపడిన విద్యార్థుల దృశ్యాలను మీడియాకు ప్రదర్శించారు. మోదీ ప్రభుత్వ హయాంలో అక్రమాలు, లీకేజీలు పెరిగిపోయి విద్యా వ్యవస్థ నాశనమైందని దుయ్యబట్టారు.

7.50 కోట్ల మంది విద్యార్థులపై తీవ్ర ప్రభావం

గత దశాబ్ద కాలంలో జరిగిన 152 పేపర్ లీకేజీల వల్ల ఏకంగా 7.50 కోట్ల మంది యువత, విద్యార్థుల భవిష్యత్తు నాశనమైందని, ఇన్ని ఆక్రమాలు జరిగినా ఒక్కరికి కూడా శిక్ష పడకపోవడం దారుణమని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. నీట్ లీకేజీ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, విద్యా వ్యవస్థను నాశనం చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీ దేశ యువతకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

కేంద్ర బడ్జెట్‌లో విద్యా రంగానికి కేటాయించేది రూ.1.4 లక్షల కోట్లు అయితే, నీట్ వంటి పరీక్షల కోచింగ్, ఫీజుల కోసం విద్యార్థుల కుటుంబాలు ఏటా రూ.1.32 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాయని, చివరకు పేపర్ లీక్ అని చెప్పి వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు.

బాధితుల తరఫున పోరాటానికి సిద్ధం

ప్రతిపక్ష నేతగా బాధితుల తరఫున నిలబడడం, ప్రజల గళం వినిపించడం తన ప్రాథమిక బాధ్యత అని, అందుకోసం ఎన్ని లాఠీ దెబ్బలైనా తినడానికి తాను సిద్ధంగా ఉన్నానని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. నీట్ విద్యార్థులపై పోలీసుల దాడికి నిరసనగా కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీతో పాటు పలువురు విపక్ష ఎంపీలు నల్లదుస్తులు ధరించి పార్లమెంట్ వద్ద నిరసన తెలిపారు.

దేశంలో పేపర్ లీకేజీలు ఒక పెద్ద మాఫియాగా మారాయని, ప్రభుత్వం కంటితుడుపు చర్యలు విడనాడి పటిష్టమైన చట్టాలు తీసుకురావాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థను కాపాడుకునేందుకు విద్యార్థులు చేస్తున్న పోరాటానికి కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.

దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్న ఇలాంటి ఘటనలపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేస్తోంది. విద్యా వ్యవస్థలో పారదర్శకత పునరుద్ధరించే వరకు విద్యార్థులకు అండగా తమ పోరాటం కొనసాగుతుందని వివరించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here