అయోధ్యలోని శ్రీరామ మందిరంలో భక్తులు సమర్పించే విరాళాల నిర్వహణలో మరింత పారదర్శకత తీసుకురావడానికి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయ హుండీల్లో వచ్చే నగదును లెక్కించే బాధ్యతను అధికారికంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)కి అప్పగిస్తూ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఇటీవల విరాళాల నిర్వహణపై వివాదాలు తలెత్తిన నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.
కొత్త విధానం ప్రకారం ఎస్‌బీఐ సిబ్బంది ప్రతిరోజూ రెండు షిఫ్టుల్లో నగదు లెక్కింపు చేపట్టనున్నారు. ప్రతి షిఫ్టులో 10 నుంచి 12 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తొలి షిఫ్టు, మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రెండో షిఫ్టు కొనసాగుతుంది. ఈ విధానాన్ని వారం రోజులపాటు ప్రయోగాత్మకంగా అమలు చేసి, అనంతరం పూర్తిస్థాయిలో కొనసాగించాలని ట్రస్టు నిర్ణయించింది.
ఇప్పటి వరకు నగదు లెక్కింపు బాధ్యతలు నిర్వహించిన విభాగంలో మార్పులు కూడా చేపట్టారు. గత ఇన్‌ఛార్జి సుభాష్ శ్రీవాస్తవ స్థానంలో శోభనాథ్ మిశ్రను నియమించారు. అలాగే నగదు లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించే బాధ్యతలను ట్రస్టు భద్రతా విభాగానికి చెందిన మాజీ సైనిక అధికారి కెప్టెన్ కె.కె. తివారీకి అప్పగించారు. లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించేందుకు ట్రస్టు తరఫున మాజీ రక్షణ సిబ్బంది ఎస్.పి. దుబే, శేషమణి తివారీని కూడా నియమించారు.
ట్రస్టు చేపట్టిన ఈ మార్పుల ప్రధాన ఉద్దేశం భక్తులు సమర్పించే విరాళాల నిర్వహణలో పూర్తి పారదర్శకతను పాటించడం, నగదు భద్రతను మరింత బలోపేతం చేయడం. ఆధునిక విధానాలతో నగదు లెక్కింపు చేపట్టడం ద్వారా ఎలాంటి అనుమానాలకు తావులేకుండా వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని ఆలయ యాజమాన్యం భావిస్తోంది.









































