పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికల నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ పేరు, ఎన్నికల గుర్తును తాత్కాలికంగా నిలిపివేస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఈ చర్యపై కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ‘‘మొదట ఓట్ల చోరీ.. తర్వాత ప్రభుత్వాల చోరీ.. ఇప్పుడు పార్టీ చోరీ’’ అంటూ ఈసీపై విమర్శలు గుప్పించారు.
पहले शिवसेना, फिर NCP और अब तृणमूल कांग्रेस।
हर बार एक ही पैटर्न – BJP और चुनाव आयोग मिलकर एक पार्टी को तोड़ते हैं। फिर उसका चुनाव चिन्ह छीन लिया जाता है।
जब पूरी की पूरी पार्टी चोरी हो सकती है, तो करोड़ों भारतीयों के वोट चोरी होना भी हैरानी की बात नहीं।
वोट चोरी। सरकार चोरी।…
— Rahul Gandhi (@RahulGandhi) September 18, 2026
‘బీజేపీ, ఈసీ కలిసి పార్టీలను చీలుస్తున్నాయి’
టీఎంసీ పేరు, ‘Flowers and Grass’ ఎన్నికల గుర్తును ఈసీ తాత్కాలికంగా ఫ్రీజ్ చేయడంపై రాహుల్ గాంధీ తన ‘ఎక్స్’ ఖాతాలో స్పందించారు. బీజేపీ, ఎన్నికల సంఘం కలిసి ప్రతిపక్ష పార్టీలను బలహీనపరిచేలా వ్యవహరిస్తున్నాయని ఆయన ఆరోపించారు.
తొలుత పార్టీలను చీల్చడం.. ఆ తర్వాత వాటి ఎన్నికల గుర్తులను తొలగించడం వంటి విధానం కొనసాగుతోందని రాహుల్ వ్యాఖ్యానించారు. గతంలో శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ విషయంలోనూ ఇదే తరహా పరిణామాలు చోటుచేసుకున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇవి ప్రజాస్వామ్య వ్యవస్థపై ఆందోళన కలిగించే పరిణామాలని రాహుల్ అభిప్రాయపడ్డారు.
‘ప్రజల తీర్పును కాపాడాల్సిన బాధ్యత ఈసీదే’
ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును రక్షించాల్సిన రాజ్యాంగబద్ధ బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని రాహుల్ గాంధీ అన్నారు. అయితే ప్రజల తీర్పును మార్చే ప్రయత్నాలకు ఈసీ సహకరిస్తోందని ఆయన ఆరోపించారు.
స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలని కోరుకునే ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి ఓటరు కోసం కాంగ్రెస్ పోరాడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ అంశం కేవలం టీఎంసీ లేదా మమతా బెనర్జీకి సంబంధించినది కాదని, స్వేచ్ఛాయుత ఎన్నికల కోసం పోరాడే ప్రతి ఒక్కరికీ సంబంధించినదని రాహుల్ అన్నారు.
టీఎంసీ పేరు, గుర్తుపై ఈసీ తాత్కాలిక ఆదేశం
ఇదిలా ఉండగా, టీఎంసీలోని అంతర్గత విభేదాల నేపథ్యంలో ఎన్నికల సంఘం సెప్టెంబర్ 17న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మమతా బెనర్జీ వర్గంతో పాటు ప్రత్యర్థి వర్గం కూడా ‘ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్’ పేరుతో, పార్టీకి కేటాయించిన ‘Flowers and Grass’ గుర్తుతో ఎన్నికల్లో పోటీ చేయాలని కోరడంతో వివాదం ఏర్పడింది.
ఈ నేపథ్యంలో తుది నిర్ణయం వెలువడే వరకు ఏ వర్గమూ టీఎంసీ అధికారిక పేరు, రిజర్వ్‌డ్ గుర్తును ఉపయోగించకూడదని ఈసీ ఆదేశించింది. రెండు వర్గాలూ ప్రత్యామ్నాయ పార్టీ పేర్లు, ఉచిత ఎన్నికల గుర్తుల కోసం తమ ఎంపికలను సమర్పించాలని సూచించింది. ఈ ఏర్పాటును రాబోయే ఉప ఎన్నికల వరకు తాత్కాలికంగా అమలు చేయనున్నట్లు ఈసీ పేర్కొంది.
అక్టోబర్ 6న బెంగాల్‌లో ఉప ఎన్నికలు
పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్, రెజినగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో అక్టోబర్ 6న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ముందు టీఎంసీ పేరు, గుర్తుపై ఈసీ తీసుకున్న మధ్యంతర నిర్ణయం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.
రెండు వర్గాల మధ్య పార్టీపై హక్కు, పేరు, గుర్తు వినియోగంపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో తుది నిర్ణయం వచ్చే వరకు తాత్కాలికంగా రెండు వర్గాలకూ వేర్వేరు పేర్లు, గుర్తులు కేటాయించే విధానాన్ని ఈసీ అనుసరిస్తోంది.
కాంగ్రెస్ నుంచి కూడా తీవ్ర అభ్యంతరం
ఈసీ నిర్ణయాన్ని కాంగ్రెస్ కూడా తీవ్రంగా వ్యతిరేకించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్.. టీఎంసీ పేరు, గుర్తును నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఇచ్చిన ‘‘లేట్ నైట్ బర్త్‌డే గిఫ్ట్’’గా అభివర్ణించారు. ఇది టీఎంసీలోని మమతా బెనర్జీ వర్గాన్ని బలహీనపరిచే ప్రయత్నమని కాంగ్రెస్ ఆరోపించింది.
అయితే ఎన్నికల సంఘం మాత్రం ఈ నిర్ణయం రెండు ప్రత్యర్థి వర్గాలను సమాన స్థాయిలో ఉంచడం, వాటి హక్కులను పరిరక్షించడం కోసమే తీసుకున్న తాత్కాలిక చర్యగా పేర్కొంది. పార్టీపై తుది నిర్ణయం ఇంకా వెలువడాల్సి ఉంది.
టీఎంసీ పేరు, గుర్తు వివాదం నేపథ్యంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలతో ఈ అంశం మరోసారి జాతీయ రాజకీయ చర్చకు కేంద్రంగా మారింది.







































