తెలంగాణలో రెండు పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటర్ల జాబితా తయారీకి సంబంధించి ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ మరియు వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ స్థానాల కాలపరిమితి మార్చి 2027 నాటితో ముగియనున్న నేపథ్యంలో అధికారులు నూతన ఓటర్ల నమోదు ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.
ఫారం-18 ద్వారా ఓటర్ల నమోదు
గతంలో ఓటరుగా నమోదైన వారైనా సరే మళ్లీ కొత్తగా ఫారం-18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల అధికారులు తెలిపారు. 2023 నవంబరు 1 నాటికంటే ముందు డిగ్రీ లేదా తత్సమాన విద్య పూర్తి చేసిన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవడానికి అర్హులని పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారా లేదా సంబంధిత తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాల్లో ఆఫ్ లైన్ ద్వారా ఫారం-18 సమర్పించవచ్చని సూచించారు.
ఓటర్ల జాబితా నమోదు సమగ్ర షెడ్యూల్
| ప్రక్రియ | తేదీ / వ్యవధి |
| పబ్లిక్ నోటీసు జారీ | సెప్టెంబర్ 28, 2026 |
| దరఖాస్తుల (ఫారం-18) స్వీకరణకు చివరి తేదీ | నవంబర్ 06, 2026 |
| ముసాయిదా (డ్రాఫ్ట్) ఓటర్ల జాబితా ప్రచురణ | నవంబర్ 25, 2026 |
| అభ్యంతరాలు, క్లెయిమ్‌ల స్వీకరణ | నవంబర్ 25 నుండి డిసెంబర్ 10, 2026 వరకు |
| అభ్యంతరాల పరిష్కారం | డిసెంబర్ 25, 2026 నాటికి |
| అంతిమ ఓటర్ల జాబితా ప్రచురణ | డిసెంబర్ 30, 2026 |
అర్హత కలిగిన పట్టభద్రులందరూ నిర్ణీత గడువులోగా తమ పేర్లను నమోదు చేసుకుని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని అధికారులు కోరారు.







































