ఆంధ్రప్రదేశ్ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించడంతో రాజధాని అమరావతి అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. అమరావతికి ప్రధాన రాచబాటగా నిలిచే సీడ్ యాక్సిస్ రోడ్డు (ఈ-3) ఫేజ్-2 మరియు స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. గతంలో రహదారి నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న స్థలాలను భూసేకరణ ద్వారా సేకరించి, అత్యంత ప్రాధాన్యతతో యుద్ధప్రాతిపదికన ఈ పనులను పూర్తి చేస్తున్నారు. ముఖ్యమంత్రి నిరంతర సమీక్షలు, ప్రత్యేక శ్రద్ధతో కేవలం రెండు వారాల స్వల్ప వ్యవధిలోనే సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది.
అమరావతి రాజధాని పరిధిలో మొత్తం 21.78 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తున్న సీడ్ యాక్సిస్ (ఈ-3) రోడ్డు ప్రాజెక్టును మూడు దశలుగా వర్గీకరించారు. అందులో భాగంగా దొండపాడు నుంచి వెంకటపాలెంలోని మంతెన ఆశ్రమం వరకు ఫేజ్-1 కింద 14.35 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం ఇప్పటికే పూర్తయి అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఫేజ్-2 కింద 3.92 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం సహా స్టీల్ బ్రిడ్జి పనులు వేగంగా పూర్తవుతుండగా, ఫేజ్-3 పరిధిలో 3.51 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
ఈ కీలక రహదారి అందుబాటులోకి రావడం వల్ల అమరావతికి రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. రాజధాని ప్రాంతంలో రవాణా వ్యవస్థ మెరుగై, పారిశ్రామిక, ఆర్థిక కార్యకలాపాలు వేగవంతం కావడానికి ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు ఎంతో కీలకమైనదిగా మారనుంది. త్వరలోనే పనులు పూర్తి చేసి రహదారిని ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.






































