తెలంగాణ లోని రేవంత్ రెడ్డి సర్కార్ రాష్ట్రంలో డిజిటల్ డిలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు మరియు ఇతర ప్లాట్‌ఫామ్ కార్మికుల శ్రేయస్సుకు సరికొత్త భద్రతా చట్రాన్ని అందుబాటులోకి తెచ్చింది. మారుతున్న సాంకేతిక యుగంలో ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లపై ఆధారపడి జీవనం సాగిస్తున్న గిగ్ కార్మికుల హక్కులను కాపాడేందుకు ‘తెలంగాణ ప్లాట్‌ఫామ్ ఆధారిత గిగ్ కార్మికుల (రిజిస్ట్రేషన్, సామాజిక భద్రత మరియు సంక్షేమ) చట్టం’ అమలులోకి తీసుకురావడం జరిగింది.
ఈ నూతన చట్టం ప్రకారం రాష్ట్రంలోని గిగ్ కార్మికులందరికీ ఒక ప్రత్యేక యూనీక్ ఐడీ కేటాయించబడుతుంది. దీనిద్వారా సంక్షేమ పథకాలు నేరుగా అర్హులకు అందుతాయి. వారి కోసం ప్రత్యేకంగా ఒక సంక్షేమ మండలి మరియు సంక్షేమ నిధి ఏర్పాటు చేశారు. ప్రముఖ అగ్రిగేటర్ సంస్థలు జరిపే ప్రతి లావాదేవీపై 1 నుండి 2 శాతం రుసుము వసూలు చేసి ఈ నిధికి జమ చేయడం జరుగుతుంది. తద్వారా ఆరోగ్య భీమా, ప్రమాద పరిహారం, పెన్షన్ మరియు ఇతర సామాజిక భద్రతా లబ్ధి చేకూరుతుంది.
అలాగే కార్మికుల వేతనాలు, అల్గారిథమ్ ఆధారిత నిర్ణయాలు, ఐడీల సస్పెన్షన్ మరియు ఇతర సమస్యల పరిష్కారానికి పారదర్శకమైన ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అందుబాటులో ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘించే ప్లాట్‌ఫామ్‌లపై కఠినమైన జరిమానాలు విధించేలా స్పష్టమైన నిబంధనలు రూపొందించారు.
రాష్ట్రంలో దాదాపు 4 లక్షలకు పైగా ఉన్న డిజిటల్ రంగానికి చెందిన ఉపాధిదారులకు ఈ చట్టం ఎంతో మేలు చేస్తుందని భావిస్తున్నారు. సామాజిక భద్రత మరియు ఆర్థిక రక్షణను కల్పించడం ద్వారా శ్రామిక వ్యవస్థ బలోపేతమవ్వడమే కాకుండా దేశానికే తెలంగాణ ఒక ఆదర్శ రాష్ట్రంగా నిలుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.







































