వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం వేళ.. నిర్వాసితులకు చంద్రబాబు సర్కార్ మరో గుడ్ న్యూస్

AP Govt Announces Rs.2 Lakh Financial Aid For Eligible Youth of Veligonda Displaced Families

వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2019 కటాఫ్ డేట్ తర్వాత 18 ఏళ్లు నిండిన అర్హులైన యువతకు కూడా ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. గెజిట్, సోషియో ఎకనామిక్ సర్వేలో పేర్లు నమోదు కాకపోయినా అర్హులైన ప్రతి నిర్వాసితుడికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అర్హులైన యువతకు రూ.2 లక్షల సాయం

2019 కటాఫ్ డేట్ నుంచి 2026 వరకు 18 ఏళ్లు నిండిన అర్హులైన యువతకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అవార్డులో పేర్లు లేని అర్హులైన యువతను కూడా గుర్తించి వారికి అవసరమైన సహాయం అందేలా చూడాలని సీఎం సూచించారు.

నిర్వాసితులకు ఇప్పటికే చెల్లించిన పరిహారానికి అదనంగా మొత్తం రూ.169 కోట్ల ఆర్థిక సాయం అందించనున్నారు. భూములు, ఆస్తులు కోల్పోయిన కుటుంబాలకు ఎలాంటి అన్యాయం జరగకుండా అన్ని అర్హతలను పరిశీలించి తగిన సాయం అందించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

1800 గ్రీవెన్సులపై ప్రత్యేక పరిశీలన

వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులను అర్హుల జాబితాలో చేర్చాలంటూ ప్రభుత్వానికి సుమారు 1,800 గ్రీవెన్సులు, పిటిషన్లు అందాయి. వీటిని పూర్తిస్థాయిలో పరిశీలించి అర్హులైన వారికి న్యాయం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఇప్పటికే 7,027 నిర్వాసిత కుటుంబాలకు రూ.905 కోట్ల ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అందించిన ప్రభుత్వం, ఇప్పుడు అదనపు ఆర్థిక సాయంతో మరింత భరోసా కల్పించేందుకు చర్యలు చేపడుతోంది. నిర్వాసిత కుటుంబాలకు నెల రోజుల అవసరాలకు సరిపడా రేషన్ కిట్లు అందించాలని కూడా సీఎం సూచించారు.

చివరి నిర్వాసితుడికి న్యాయం చేసే వరకు చర్యలు

వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ఏ ప్రాజెక్టులోనూ లభించనంత భరోసా ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అందిన గ్రీవెన్సులను పూర్తిగా పరిశీలించిన అనంతరం అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు.

ఆగస్టు 31న వెలిగొండ ప్రాజెక్టుకు నీటిని అందించే ప్రక్రియతో పాటు, చివరి నిర్వాసితుడికి న్యాయం జరిగే వరకు ప్రభుత్వ చర్యలు కొనసాగుతాయని మంత్రి స్పష్టం చేశారు. నిర్వాసిత కాలనీల్లో మౌలిక సదుపాయాలను పూర్తి చేసి, బాధిత కుటుంబాలకు ఎక్కడా అన్యాయం జరగకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here