కామన్వెల్త్ గేమ్స్ 2026లో పతకాలు సాధించిన భారత అథ్లెట్లతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తన నివాసంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ, సహాయ మంత్రి రక్షా ఖడ్సే, భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు క్రీడాకారులతో మోదీ ఆసక్తికరంగా ముచ్చటించారు.
లవ్లీనా బోర్గోహెయిన్ దేశభక్తిని ప్రశంసించడంతో పాటు.. వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను భావోద్వేగ క్షణాల గురించి అడిగి తెలుసుకున్నారు. బాక్సర్ నరేంద్ర బేర్వాల్ చెప్పిన సరదా సంఘటనకు ప్రధాని మోదీ నవ్వుకున్నారు.
భారత మ్యాప్‌పై లవ్లీనా అభ్యంతరం
కామన్వెల్త్ గేమ్స్ సందర్భంగా గ్లాస్గోలోని ఓ రెస్టారెంట్లో భారత జాతీయ పతాకాన్ని తప్పుగా ముద్రించిన ఘటనను బాక్సర్ లవ్లీనా బోర్గోహెయిన్ ప్రధాని మోదీతో పంచుకున్నారు. జాతీయ పతాకంలో ఈశాన్య రాష్ట్రాలు కనిపించకపోవడాన్ని గమనించిన లవ్లీనా.. వెంటనే రెస్టారెంట్ సిబ్బందికి విషయాన్ని తెలియజేసి దాన్ని సరిచేయించినట్లు వివరించారు.
ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని సరదాగా లవ్లీనా ఏం జరిగిందని అడిగారు. దీనికి ఆమె.. కామన్వెల్త్ గేమ్స్ చివరి రోజు అందరూ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న సమయంలో రెస్టారెంట్లో తప్పుగా ముద్రించిన భారత జాతీయ పతాకాన్ని గమనించానని, దాన్ని సిబ్బందికి మర్యాదగా చెప్పడంతో వారు వెంటనే సరిచేశారని తెలిపారు.
లవ్లీనా స్పందనను ప్రధాని మోదీ అభినందించారు. గేమ్స్ విజయాన్ని ఆస్వాదిస్తున్న సమయంలోనూ దేశ ప్రతిష్ఠకు సంబంధించిన అంశాన్ని గుర్తించి స్పందించడం గొప్ప విషయమని ప్రశంసించారు. దేశం పట్ల ఆమెకున్న గౌరవం అభినందనీయమని పేర్కొన్నారు.
మీరాబాయి కన్నీళ్ల వెనుక కారణమేంటి?
వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చానుతోనూ ప్రధాని ప్రత్యేకంగా మాట్లాడారు. కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించిన సమయంలో ఆమె కన్నీళ్లు పెట్టుకోవడంపై ప్రధాని ఆరా తీశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్వయంగా ఆమెకు లడ్డూ తినిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
తన భావోద్వేగానికి కారణాన్ని మీరాబాయి వివరిస్తూ.. పారిస్ ఒలింపిక్స్‌లో కేవలం కిలో తేడాతో పతకాన్ని కోల్పోయిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. అనంతరం నాలుగేళ్ల పాటు గాయాలు, కుటుంబ సమస్యలతో అనేక కష్టాలు ఎదుర్కొన్నానని తెలిపారు.
గ్లాస్గోలో పతక వేదికపై నిలబడి, భారత జాతీయ పతాకం రెపరెపలాడుతుండగా జాతీయ గీతం వినిపించిన క్షణంలో నాలుగేళ్ల కష్టాలు గుర్తొచ్చి కన్నీళ్లు ఆగలేదని మీరాబాయి భావోద్వేగంగా వివరించారు.
ప్రధాని మోదీని నవ్వించిన బాక్సర్ నరేంద్ర బేర్వాల్
ఇదే కార్యక్రమంలో బాక్సర్ నరేంద్ర బేర్వాల్ చెప్పిన ఓ సరదా సంఘటన ప్రధాని మోదీతో పాటు అక్కడున్న వారందరినీ నవ్వించింది. 2015 మిలిటరీ వరల్డ్ గేమ్స్‌లో పాకిస్థాన్ బాక్సర్తో జరిగిన పోరును బేర్వాల్ గుర్తుచేసుకున్నారు.
ఆ పోరులో తాను విజయం సాధించానని, అయితే ఇద్దరికీ గాయాలు కావడంతో చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లామని తెలిపారు. అక్కడ పాకిస్థాన్ బాక్సర్ తనతో ఓ సరదా మాట చెప్పాడని బేర్వాల్ వెల్లడించారు.
తన పేరు నరేంద్ర, తన కోచ్ పేరు కూడా నరేంద్ర రాణా, దేశ ప్రధాని పేరు కూడా నరేంద్రమేనని ఆ పాకిస్థాన్ బాక్సర్ సరదాగా వ్యాఖ్యానించాడని బేర్వాల్ తెలిపారు. “నాకు ఈ పేరు అంటేనే అసహ్యం వచ్చేసింది” అని అతడు అన్నట్లు బేర్వాల్ చెప్పడంతో ప్రధాని మోదీ గట్టిగా నవ్వారు.
క్రీడాకారులతో మోదీ ప్రత్యేక ముచ్చట్లు
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత అథ్లెట్లు సాధించిన విజయాలను ప్రధాని మోదీ అభినందించారు. క్రీడాకారుల వ్యక్తిగత అనుభవాలు, విజయాల వెనుక ఉన్న కష్టాలను తెలుసుకుంటూ వారితో సరదాగా సంభాషించారు.
లవ్లీనా దేశభక్తి, మీరాబాయి భావోద్వేగం, నరేంద్ర బేర్వాల్ సరదా సంఘటన.. ఇలా ఈ భేటీ క్రీడాకారులు, ప్రధాని మధ్య ఆత్మీయ సంభాషణకు వేదికగా నిలిచింది.







































