నేపాల్ వరదల్లో చిక్కుకున్న ఏపీ యాత్రికులు.. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ప్రత్యేక సమీక్ష

CM Chandrababu and Minister Nara Lokesh Reviewed on AP Pilgrims Stranded in Nepal Floods

నేపాల్‌లో సంభవించిన భారీ వరదల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ వాసులను గుర్తించి, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. బాధిత యాత్రికుల పరిస్థితిని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన సహాయం అందించాలని సూచించారు.

ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని సహాయక చర్యలను వేగవంతం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ వాసులు, వారి కుటుంబ సభ్యుల సహాయం కోసం ఏపీ భవన్ కంట్రోల్ రూం సేవలను కూడా అందుబాటులో ఉంచారు.

ఏడుగురు ఏపీ యాత్రికుల పరిస్థితిపై లోకేశ్ సమీక్ష

మరోవైపు నేపాల్ వరదల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ యాత్రికుల క్షేమ సమాచారంపై రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ కూడా ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. నేపాల్‌లో చిక్కుకున్న ఏడుగురు ఏపీ యాత్రికుల వివరాలను అధికారులు మంత్రికి వివరించారు.

వీరిలో నలుగురు సురక్షితంగా ఉన్నట్లు సమాచారం అందగా, మరో ముగ్గురు యాత్రికుల ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు ఏపీ ఢిల్లీ భవన్ అధికారులు తెలిపారు. కుప్పం ప్రాంతానికి చెందిన బాల సుబ్రహ్మణ్యం, ఈషా ఫౌండేషన్ బృందానికి చెందిన శశికుమార్, రాజ్యలక్ష్మి ఆచూకీ ఇంకా లభించలేదని అధికారులు వెల్లడించారు.

ముగ్గురి ఆచూకీ కోసం నిరంతర ప్రయత్నాలు

కనిపించకుండా పోయిన ముగ్గురు యాత్రికుల ఆచూకీని త్వరగా గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరపాలని మంత్రి లోకేశ్ ఆదేశించారు. ఈషా ఫౌండేషన్ సభ్యుడు శశికుమార్ చైనాలోని గైరోంగ్ ప్రాంతంలో చివరిసారిగా కనిపించినట్లు సమాచారం ఉన్న నేపథ్యంలో సంబంధిత అధికార సంస్థలతో సంప్రదింపులు కొనసాగిస్తున్నారు.

అదే సమయంలో కర్నూలు జిల్లాకు చెందిన భాస్కర్ శాస్త్రి సహా మరో ముగ్గురు కైలాస మానససరోవర్ యాత్రికులు వరదల ప్రభావానికి గురైనప్పటికీ సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. క్షేమంగా ఉన్న వారిని వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.

ఎంబసీలు, ఇమ్మిగ్రేషన్ కేంద్రాలతో సమన్వయం

యాత్రికుల భద్రతకు సంబంధించి భారత రాయబార కార్యాలయం, చైనా మరియు నేపాల్‌లోని సంబంధిత అధికార సంస్థలు, గైరోంగ్ ఇమ్మిగ్రేషన్ కేంద్రం, ఈషా ఫౌండేషన్‌తో నిరంతరం సమన్వయం కొనసాగించాలని మంత్రి లోకేశ్ సూచించారు.

నేపాల్‌లో చిక్కుకున్న యాత్రికులతో పాటు కైలాస మానససరోవర్ యాత్రకు వెళ్లిన ఏపీ వాసుల వివరాలను ఆర్టీజీఎస్ అధికారులు సేకరిస్తున్నారు. మంత్రి సూచనల మేరకు ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

ఏపీ భవన్ కంట్రోల్ రూం వివరాలు

నేపాల్ వరదల ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ఏపీ వాసుల సమాచారం లేదా సహాయం కోసం కుటుంబ సభ్యులు కింది నంబర్లను సంప్రదించవచ్చు:

  • AP Bhavan Control Room: 011-23384016
  • AP Bhavan Control Room: 011-23387089
  • WhatsApp: 9059824101

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here