తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా సవరణలో భాగంగా పెద్ద సంఖ్యలో ఓట్లు తొలగింపునకు సంబంధించిన అంశాలపై సమగ్ర పరిశీలన చేపట్టాలని కోరుతూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు సీఎం లేఖ రాశారు. SIR ప్రక్రియలో దాదాపు 92.86 లక్షల ఓట్ల తొలగింపుకు సంబంధించిన అంశాన్ని ఎన్నికల సంఘం ప్రత్యేకంగా పరిశీలించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
క్లెయిమ్స్, అభ్యంతరాలకు మరో నాలుగు వారాల గడువు కోరిన సీఎం
SIR ప్రక్రియలో భాగంగా ఓటర్ల నుంచి క్లెయిమ్స్, అభ్యంతరాలు స్వీకరించేందుకు ప్రస్తుతం ఉన్న గడువు సరిపోదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఓటర్లు తమ వివరాలను పరిశీలించుకోవడంతో పాటు, అవసరమైతే సవరణలు చేసుకునేందుకు అదనపు సమయం అవసరమని తెలిపారు. ఈ నేపథ్యంలో క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ గడువును మరో నాలుగు వారాల పాటు పొడిగించాలని సీఈసీని కోరారు.
వలస, రోజువారీ కూలీలకు అదనపు అవకాశం
వలస కూలీలు, రోజువారీ కూలీలు సహా వివిధ వర్గాలకు చెందిన ప్రజలు తమ ఓటు హక్కు వివరాలను సకాలంలో పరిశీలించుకునే అవకాశం కల్పించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. అవసరమైన పత్రాలను సమర్పించడం, పేర్ల తొలగింపు లేదా సవరణలకు సంబంధించిన అభ్యంతరాలను నమోదు చేయడం కోసం వారికి మరింత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందని లేఖలో పేర్కొన్నారు.
హైదరాబాద్ పరిసర జిల్లాలకు అదనపు సిబ్బంది
హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, రంగారెడ్డి జిల్లాల్లో అధిక సంఖ్యలో ఓటర్లు ఉన్నందున SIR ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు అదనపు సిబ్బందిని నియమించాలని సీఎం సూచించారు. ముఖ్యంగా ఈ మూడు జిల్లాల్లో అదనపు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లను (EROలు) నియమించడం ద్వారా ఓటర్లకు మెరుగైన సేవలు అందించవచ్చని పేర్కొన్నారు.
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను మరింత పారదర్శకంగా, ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండేలా వికేంద్రీకరించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి సీఈసీకి విజ్ఞప్తి చేశారు. అర్హులైన ఒక్క ఓటరు కూడా ఓటు హక్కును కోల్పోకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.




































