చిప్ డిజైన్ నుంచి తయారీ వరకు.. సెమికాన్ 2.0లో భారత్‌ వ్యూహం ఇదే..!

Semicon 2.0 India’s Six-Pillar Plan to Build a Semiconductor Powerhouse

భారత్‌ను ప్రపంచ సెమీకండక్టర్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో నిర్వహిస్తున్న ‘సెమికాన్ ఇండియా 2026’ ఐదో ఎడిషన్‌కు మరో రెండు రోజుల్లో శ్రీకారం చుట్టనున్నారు. సెప్టెంబర్ 17న ఢిల్లీలోని యశోభూమిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. సెమికాన్ ఇండియా తొలి దశలో సాధించిన పురోగతి, ఇప్పటికే మూడు సెమీకండక్టర్ తయారీ యూనిట్లు వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించిన నేపథ్యంలో.. ఈ రంగానికి దీర్ఘకాలిక విధానపరమైన మద్దతును కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘సెమికాన్ 2.0’ను ముందుకు తీసుకొచ్చింది.

సెమికాన్ 2.0 కింద దేశంలో సెమీకండక్టర్ ఎకోసిస్టమ్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు ఆరు ప్రధాన స్తంభాలను కేంద్రం నిర్దేశించింది. చిప్ డిజైన్ నుంచి తయారీ, ప్యాకేజింగ్, పరిశోధన, ముడి పదార్థాల సరఫరా, నైపుణ్యాభివృద్ధి వరకు మొత్తం వ్యవస్థను దేశీయంగా బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.

1. చిప్ డిజైన్

సెమీకండక్టర్ రంగంలో తొలి అడుగు చిప్ డిజైన్. దేశీయంగా ప్రాసెసర్లు, సిస్టమ్-ఆన్-చిప్స్ (SoCs), సెమీకండక్టర్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ (IP)లను అభివృద్ధి చేసే కంపెనీలకు ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహకాలు అందించనుంది. డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ (DLI) వంటి పథకాల ద్వారా దేశీయ సంస్థలను ప్రోత్సహించనున్నారు.

దీంతో రక్షణ, రోదసి, కృత్రిమ మేధ (AI), టెలికాం వంటి కీలక రంగాలకు అవసరమైన చిప్‌లను దేశీయంగా డిజైన్ చేసే సామర్థ్యం పెరగనుంది.

2. యంత్రాలు, ముడి పదార్థాల తయారీ

చిప్ తయారీకి అవసరమైన ప్రత్యేక యంత్రాలు, అత్యంత శుద్ధి చేసిన రసాయనాలు, ప్రత్యేక వాయువులు, ఇతర కీలక మెటీరియల్స్‌ను దేశంలోనే తయారు చేసేలా పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వనున్నారు. ప్రస్తుతం ఈ ఉత్పత్తుల కోసం విదేశాలపై ఉన్న ఆధారపడే పరిస్థితిని తగ్గించడం ద్వారా సెమీకండక్టర్ సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని కేంద్రం భావిస్తోంది.

3. సెమీకండక్టర్ తయారీ కేంద్రాల ఏర్పాటు

సిలికాన్ వాఫర్ ఫ్యాబ్‌లు, డిస్‌ప్లే ఫ్యాబ్‌లు, ఈవీలు, పవర్ ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో ఉపయోగించే కాంపౌండ్ సెమీకండక్టర్ తయారీ కేంద్రాలను దేశంలో మరింత విస్తరించనున్నారు. ఇందుకోసం భారీ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు తయారీ మౌలిక వసతులను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టనున్నారు.

4. అసెంబ్లీ, ప్యాకేజింగ్ పరిశ్రమకు బలం

చిప్ తయారీతో పాటు వాటిని కట్ చేయడం, అసెంబ్లింగ్, టెస్టింగ్, ప్యాకేజింగ్ వంటి ప్రక్రియలు కూడా కీలకమే. అందుకే అడ్వాన్స్‌డ్ ప్యాకేజింగ్, ATMP, OSAT యూనిట్లను మరింత బలోపేతం చేయాలని సెమికాన్ 2.0లో నిర్ణయించారు. తయారైన చిప్‌ను తుది వినియోగానికి సిద్ధం చేసే ఈ రంగం విస్తరణతో దేశీయ సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ మరింత సంపూర్ణంగా మారనుంది.

5. పరిశోధన, అభివృద్ధికి ప్రాధాన్యత

భవిష్యత్ సాంకేతికతల్లో భారత్ ముందంజలో ఉండేలా పరిశోధన, అభివృద్ధి రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. AI చిప్స్, నెక్స్ట్ జనరేషన్ సెమీకండక్టర్ల వంటి ఆధునిక సాంకేతికతలపై పరిశోధనలకు దేశీయ సంస్థలకు మద్దతు ఇవ్వడంతో పాటు అంతర్జాతీయ పరిశోధనా కేంద్రాలతో భాగస్వామ్యాలను ప్రోత్సహించనున్నారు.

6. నైపుణ్యాభివృద్ధి, మానవ వనరుల తయారీ

సెమీకండక్టర్ పరిశ్రమ విస్తరించాలంటే నైపుణ్యం కలిగిన మానవ వనరులు కీలకం. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ విద్యార్థులు, పరిశ్రమ నిపుణులకు ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పెద్ద సంఖ్యలో సెమీకండక్టర్ ఇంజనీర్లు, టెక్నికల్ నిపుణులను తయారు చేయడమే ఈ స్తంభం లక్ష్యం.

ఇక కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MeitY) ఆధ్వర్యంలోని ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ISM) ద్వారా విద్యాసంస్థలు, స్టార్టప్‌లకు ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్ (EDA) టూల్స్‌ను ఉచితంగా లేదా రాయితీపై అందిస్తున్నారు. ఇప్పటివరకు 400కుపైగా విద్యాసంస్థలకు, 105 స్టార్టప్‌లకు EDA టూల్స్ అందించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం కింద 24 స్టార్టప్‌లకు ఆమోదం లభించింది.

సెమికాన్ ఇండియా 2026లో స్టార్టప్‌లు, విద్యార్థుల హ్యాకథాన్‌లు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వనున్నారు. దీంతో భారత్‌లో సెమీకండక్టర్ పరిశ్రమకు అవసరమైన సాంకేతికత, తయారీ సామర్థ్యం, పరిశోధన, నైపుణ్యం వంటి అన్ని విభాగాలను ఒకే ఎకోసిస్టమ్‌లోకి తీసుకురావడమే కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here