ఏపీ 2026-27 ఎక్సైజ్ పాలసీ ప్రకటించిన చంద్రబాబు సర్కార్

AP Govt Announces 2026-27 Excise Policy With New Rules For Liquor Shops

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కొత్త ఎక్సైజ్ పాలసీని ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3,736 మద్యం షాపుల లైసెన్సులను మరో ఏడాది పాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పొడిగింపు 2026 అక్టోబర్ 1 నుంచి 2027 సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉండనుంది. లైసెన్సును కొనసాగించేందుకు ముందుకు రాని షాపులను లాటరీ విధానంలో కేటాయించనున్నారు. ప్రతి దరఖాస్తుకు రూ.3 లక్షల నాన్-రిఫండబుల్ ఫీజును ప్రభుత్వం నిర్ణయించింది.

మద్యం విక్రయాల్లో నిబంధనల ఉల్లంఘనలను అరికట్టేందుకు కొత్త పాలసీలో కఠినమైన చర్యలను పొందుపరిచారు. ఎమ్మార్పీ కంటే అధిక ధరకు విక్రయించడం, డ్యూటీ చెల్లించని మద్యం విక్రయించడం, బ్రాండ్లను కలపడం వంటి ఉల్లంఘనలపై చర్యలు తీసుకోనున్నారు. మొదటిసారి నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.10 లక్షల వరకు జరిమానా విధించడంతో పాటు, మరోసారి తప్పిదం జరిగితే లైసెన్స్ రద్దు చేసేలా నిబంధనలు రూపొందించారు.

ప్రతి మద్యం షాపులో కనీసం నాలుగు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడం తప్పనిసరి చేశారు. వీటి ద్వారా 24 గంటల పర్యవేక్షణ చేపట్టనున్నారు. కృత్రిమ మేధ సాంకేతికతను ఉపయోగించి అనుమానాస్పద కార్యకలాపాలు, నిబంధనల ఉల్లంఘనలను గుర్తించే విధానాన్ని అమలు చేయనున్నారు. మద్యం ఉత్పత్తి నుంచి వినియోగదారుడికి విక్రయించే దశ వరకు మొత్తం సరఫరా వ్యవస్థను డిజిటల్ ట్రాక్ అండ్ ట్రేస్ విధానంలో పర్యవేక్షించనున్నారు.

ప్రతి దుకాణంలో మద్యం ఉత్పత్తుల ఎమ్మార్పీ వివరాలను స్పష్టంగా ప్రదర్శించాల్సి ఉంటుంది. వినియోగదారుల సమస్యలు, ఫిర్యాదుల కోసం 14405 టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. నగదు లావాదేవీలతో పాటు డిజిటల్ చెల్లింపులను కూడా తప్పనిసరిగా స్వీకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. వినియోగదారులు తమకు అనుకూలమైన చెల్లింపు విధానాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది.

అక్రమ మద్యం విక్రయాలను నియంత్రించేందుకు కూడా ప్రభుత్వం ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. అక్రమంగా మద్యం విక్రయించినట్లు తేలితే మొదటి తప్పిదానికి రూ.5 లక్షల జరిమానా విధించనున్నారు. అదే తప్పిదం మరోసారి జరిగితే షాపు లైసెన్స్‌ను రద్దు చేయనున్నారు. అక్రమ లేదా కల్తీ మద్యం నిల్వలు, విక్రయాలపై అధికారులకు సమాచారం అందించే వారికి ప్రోత్సాహక బహుమతులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీజ్‌కు దారితీసే విశ్వసనీయ సమాచారాన్ని అందించిన వారికి గరిష్ఠంగా రూ.లక్ష వరకు రివార్డు అందించనున్నారు.

కొత్త ఎక్సైజ్ పాలసీ ద్వారా మద్యం విక్రయాల్లో పారదర్శకత పెంచడంతో పాటు అక్రమ కార్యకలాపాలను నియంత్రించడం, వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడం, షాపుల నిర్వహణపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించడం లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here